నాలుగేళ్ల తన కూతురిపై జరిగిన కిడ్నాప్ ప్రయత్నాన్ని వమ్ము చేసింది దిల్లీలోని ఓ మహిళ. డబ్బులు దోచుకోవడానికి చిన్నారిని అపహరించాలని కుటుంబసభ్యుడే ఒడిగట్టిన ఈ పనిని ఆ తల్లి అడ్డుకుంది. కిడ్నాపర్ల చెర నుంచి తన కూతుర్ని విడిపించుకోవడం సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. మంగళవారం జరిగిన ఈ ఘటన తాలూకు దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.


పోలీసుల కథనం ప్రకారం బాలికకు బాబాయ్​ వరసయ్యే ఉపేందర్​ ఈ కిడ్నాప్​ ప్రణాళిక రచించాడు. బాలిక తల్లితండ్రుల నుంచి డబ్బులు దండుకునేందుకు ఈ పన్నాగం పన్నాడు. తన సోదరుడి నుంచి రూ.30 - రూ. 35 లక్షలు డిమాండ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. బాలికను అపహరించేందుకు ఇద్దరు మనుషుల్ని పంపించాడు. చివరకు ఈ ప్రయత్నం విఫలమై పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఉపేందర్​తో పాటు మరొక వ్యక్తిని అరెస్టు చేసినట్లు తూర్పు దిల్లీ కృష్ణా నగర్ పోలీసులు తెలిపారు.కిడ్నాపర్ల నుంచి తన కూతుర్ని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఉపేందర్ పంపిన ఇద్దరు వ్యక్తులు చిన్నారిని అపహరించడానికి ప్రయత్నించగా.. ఎవరి సహాయం లేకుండానే వారిని నిలువరించగలిగింది ఆమె. తన కూతుర్ని కిడ్నాపర్ల చేతుల నుంచి విడిపించుకుంది. అనంతరం వారిని ఆపేందుకు ప్రయత్నించింది. కిడ్నాపర్లు పారిపోయే సమయంలో చుట్టుపక్కల వారు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఇరువురు అక్కడి నుంచి తప్పించుకోగలిగారు. ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయారు.

 

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. బైక్​తో పాటు ఓ దేశీయ పిస్తోల్​, నాలుగు బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో నిందితులు బాధితురాలి ఇంటికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మంచినీరు కావాలని అడగితే.. నీళ్ల కోసం బాలిక తల్లి ఇంట్లోకి వెళ్లిందని... దీంతో బాలికను కిడ్నాప్ చేసేందుకు నిందితులు ప్రయత్నించారని వెల్లడించారు. అయితే తల్లి మాత్రం సురక్షితంగా తన కూతుర్ని కాపాడుకుందని చెప్పారు.వారం రోజుల నుంచి నిందితులు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించారని పోలీసులు వెల్లడించారు. ద్విచక్ర వాహనానికి నకిలీ నెంబర్ తగిలించినట్లు చెప్పారు. అనంతరం విచారణలో ద్విచక్ర వాహనం న్యూ గోవింద్​పురాకు చెందిన ధీరజ్​ అనే వ్యక్తిదని తేలిందని స్పష్టం చేశారు. న్యూ గోవింద్​పురాలో తనిఖీ చేయగా.. నిందితుడు అక్కడి నుంచి ఐదేళ్ల క్రితమే మకాం మార్చాడని తెలిసిందని... తర్వాత జగత్​పురి ప్రాంతంలో ధీరజ్​ను అరెస్ట్​ చేశామని పోలీసులు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: