ప్రజాసమస్యలపై పోరాడే వాడే నాయకుడు అవుతాడు.. ఈ పోరాటం సుదీర్ఘంగా సాగాల్సి ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయం కూల్చివేతపై ఇదే తరహా పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయానికి ఎలాంటి ఇబ్బందులు లేకున్నా.. దాన్ని కూల్చి కొత్తది కట్టాలంటున్న కేసీఆర్ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన పోరాటం సాగిస్తున్నారు. 

 

 


అయితే రాష్ట్ర హైకోర్టులో ఈ అంశంపై కొంతకాలంగా న్యాయపోరాటం నడిచింది. అయితే ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమంటూ మొత్తానికి రాష్ట్ర హైకోర్టు సచివాలయం కూల్చి వేతకు పచ్చజెండా ఊపేసింది. దీంతో కేసీఆర్ సర్కారు సచివాలయం కూల్చి వేత పనిలో పడింది. అయితే రాష్ట్ర హైకోర్టులో సచివాలయం కూల్చివేతను అడ్డుకోలేకపోయినా ... రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు.

 

 


చివరకు ఆయన తెలంగాణ సచివాలయ కూల్చివేతను  వ్యతిరేకిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ను ఆశ్రయించారు. రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్  విచారణ చేపట్టింది. సచివాలయం కూల్చివేత అనేది పర్యావరణంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అన్నది రేవంత్ రెడ్డి వాదనగా ఉంది. 

 

 


రేవంత్ రెడ్డి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ట్రైబ్యునల్... కూల్చివేత వల్ల పర్యావరణంపై కలిగే ప్రభావం, వ్యర్థాల నిర్వహణపై అధ్యయనానికి కిమిటీని నియమించింది. రెండునెలల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఏర్పాటు చేసిన ఈ కమిటీలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ హైదరాబాద్ , తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలికి స్థానం కల్పించింది. తదుపరి విచారణనను సెప్టెంబర్ 25 వరకు వాయిదా వేశారు. అయితే హైకోర్టు కూల్చివేతకు పచ్చజండా ఊపినందువల్ల గ్రీన్ ట్రైబ్యునల్‌ లో విచారణ ఎంత వరకూ ప్రభావం చూపుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: