వైసీపీ అధినాయకత్వాన్ని ఎదిరిస్తూ వార్తల్లో వ్యక్తిగా మారిన
ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. కరోనా అంటించి తనను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆయన చెప్పారు. గతంలో తనపై తన సొంత నియోజకవర్గంలోనే దాడికి కుట్ర పన్నారని, తనకు ప్రాణ హాని ఉందని, దీని వెనక
వైసీపీ పాత్ర కూడా ఉందని సంచలనం రేపిన రఘురామ కృష్ణంరాజు.. లోక్ సభ స్పీకర్ కి ఫిర్యాదు చేసి మరీ సెక్యూరిటీ పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి తనకు ప్రాణ హాని తలపెడుతున్నారంటూ వాపోయారు రఘురామ కృష్ణంరాజు. ఈసారి తనకు కరనా వైరస్ అంటించి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. ఈ సారి కూడా రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆయన విమర్శలు గుప్పించారు.

రాష్ట్ర ప్రభుత్వం తనపై కరోనా కేసు పెట్టి.. కరోనా అంటించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు రఘురామ కృష్ణంరాజు. కొంతమంది ప్రభుత్వ పెద్దల చర్యలను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొంతమంది ఆలయాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తన కార్యాలయంపై కూడా దాడులు జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని అనుమానం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆవేశంలో మాట్లాడితే తనపై కేసులు పెట్టాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

ఇక రాష్ట్రంలో మత మార్పిడుల విషయంపై కూడా రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మత మార్పిడులు చేసి, ఓటు బ్యాంకు పెంచుకునేందుకు
వైసీపీ ప్రయత్నిస్తోందని చంద్రబాబు విమర్శించిన మరుసటి రోజే రఘురామ కృష్ణంరాజు కూడా సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాష్ట్రంలో మత మార్పిడిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నారని, దానికోసం విదేశాల నుంచి భారీగా నిధులు వస్తున్నాయని రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. ప్రజలు ఎంత తెలివైన వారో ఓట్లు వేసే సమయంలో బయటపడుతుందని, ఫ్యాన్ గుర్తుకు ఓట్లు పడాలంటే ప్రజలను గిల్లటం ఆపాలని పరోక్షంగా
వైసీపీ అధినాయకత్వాన్ని హితవు పలికారు.