ఎన్డీఏ ప్రభుత్వంలో జగన్ పార్టీ చేరడం ఖాయమన్న ఊహాగానాలు ఢిల్లీలో బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవలే అమిత్ షా ను కలిసిన జగన్.. మళ్లీ కొద్దిరోజుల్లోనే ఏకంగా ప్రధానితో భేటీ కావడం ఈ విశ్లేషణలకు బలం చేకూరుస్తోంది. దీనికి తోడు కొద్దినెలల తేడాతోనే ఎన్డీఏ నుంచి కీలకమైన భాగస్వామ్య పక్షాలు దూరం కావడం మోడీ సర్కారుకు ఇబ్బందిగా పరిణమించింది. శివసేన, అకాలీదళ్ వంటి మిత్ర పక్షాలు దూరమయ్యాయి. ఇప్పుడు ఆ లోటు భర్తీ చేసుకోవడం బీజేపీకి వైసీపీ రూపంలో అవకాశం చిక్కినట్టు కనిపిస్తోంది.

ఇటు జగన్ కు కూడా కేంద్రం అండ అవసరంగా కనిపిస్తోంది. సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయాలంటే కేంద్రం నుంచి నిధులు తెప్పించుకోవడం అవసరం.. దీనికితోడు.. జగన్ పై ఉన్న కేసుల విచారణ కూడా కేంద్రం చేతిలోని దర్యాప్తు సంస్థలతోనే ముడిపడి ఉంది. ఈ పరిణామాలతో బీజేపీతో దోస్తీ కట్టడం వైసీపీకీ.. వైసీపీని చేర్చుకోవడం బీజేపీకి ఉభయులకూ ఈ ప్రతిపాదన లాభదాయకంగా కనిపిస్తోంది.    

అయితే జగన్ వంటి నాయకుడు నిర్దిష్ట హామీలు లేకుండా బీజేపీ వంటి పార్టీతో జట్టు కట్టే అవకాశాలు తక్కువ. అందులోనూ టీడీపీ అధినేత చంద్రబాబు కొంతకాలంగా బీజేపీకి దగ్గరయ్యేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆయనకు స్నేహ హస్తం చాచేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. ఇలాంటి సమయంలో వైసీపీ బీజేపీతో జట్టు కడతే అది చంద్రబాబుకు పెద్ద దెబ్బే అవుతుందనడంలో సందేహం లేదు.

ఒకవేళ జగన్ బీజేపీతో జట్టుకడితే.. రాజధాని భూముల కేసులు, ఫైబర్ నెట్ వంటి కేసుల్లో సీబీఐ విచారణ ఊపందుకునే అవకాశం ఉంది. ఎన్నికల ముందు చంద్రబాబు మోడీ, అమిత్ షాలను తిట్టిన తిట్లు ఇంకా ఆ  పార్టీ నేతలు అప్పుడే మరిచిపోలేదు. ఈ పరిణామాల రీత్యా చంద్రబాబును టార్గెట్ చేయడం బీజేపీ, వైసీపీ ఉమ్మడి అజెండా అవుతుంది. అదే జరిగితే ఇక చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: