ఎట్టకేలకు ఏపీ సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది.కేంద్రంలో బిజెపి, వైసిపి కాస్తోకూస్తో సఖ్యతగా ఉన్నట్టుగా కనిపిస్తు న్నా, ఏపీ విషయానికి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో బిజెపి నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ మాటల దాడి మరింతగా పెంచారు. ఈ క్రమంలోనే వైసిపి సైతం బిజెపి పై పరోక్షంగా యుద్ధానికి దిగుతుంది. నేరుగా విమర్శలు చేయకపోయినప్పటికీ, కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణలు బిల్లుకు వ్యతిరేకంగా రైతు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది.



ఈ పరిణామాలు ఇలా ఉండగానే అకస్మాత్తుగా ఏపీ సీఎం జగన్ ఢిల్లీ రావలసిందిగా బిజెపి పెద్దలు వర్తమానం పంపడం,  ఈ మేరకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడంతో ఈ రోజు రాత్రి 9 గంటలకు జగన్ అమిత్ షా భేటీ అయ్యారు. ఈ భేటీలో అనేక అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యలు,  తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట నష్టం గురించి చర్చించినట్లు తెలుస్తోంది.అలాగే అనేక రాజకీయ అంశాల పైన అమిత్ షా తో జగన్ చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా వ్యవసాయ సంస్కరణలు బిల్లు విషయంలో కేంద్రం ఎంత పట్టుదలతో ఉంది అనే విషయాన్ని జగన్ కు అమిత్ షా వివరించినట్లు తెలుస్తోంది. 




తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం కొద్దిరోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా వంటి వారిని కలిశారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ సైతం ఢిల్లీ పెద్దలను కలుసుకోవడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పూర్తిగా వీరి భేటీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: