కేటీఆరే తదుపరి సీఎం.. మొన్నటి వరకూ కొన్ని నెలలపాటు ఇదే ఊహాగానాలు నడిచాయి. అంతా అదే నిజం కాబోతోందని అనుకున్నారు. అసలు ఎన్నికల్లో రెండోసారి టీఆర్ఎస్ గెలిచిన నాటి నుంచే ఈ వాదన ఉంది. అంతే కాదు.. ఆ తర్వాత కేటీఆర్‌ కు పార్టీ పదవి అప్పగించిన తర్వాత కూడా ఇక నెక్స్ట్‌ పదవి సీఎంయే అనుకున్నారు. కానీ.. అలా జరగలేదు. అంతే కాదు.. ఏకంగా కేసీఆర్ సీన్‌లోకి వచ్చి పదేళ్లు నేనే సీఎంగా ఉంటా అని కుండబద్దలు కొట్టేశారు.


అయితే కేటీఆర్ ఇప్పుడే కాదు.. ఎప్పటికీ సీఎం కాలేడంటున్నారు బీజేపీ నాయకులు. బీజేపీ  రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఈ విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు ప్రభాకర్. బీజేపీ అభ్యర్థులు గెలిస్తే.. కేటీఆర్ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాడా? అని సవార్ విసిరారు.


అంతేకాదు.. ఓవైసీ, కేటీఆర్  ప్రొఫెసర్ నాగేశ్వర్ కోసం పనిచేస్తోంటే.. మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలు వాణీదేవి గెలుపు కోసం పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. తన జీవితంలో కేటీఆర్ ముఖ్యమంత్రి కావటం అసాధ్యమని.. ఎమ్మెల్సీ ఎన్నిక తర్వాత తెరాసకు ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వటం ఖాయమని.. నాయకత్వం తీరుతో తెరాస క్యాడర్ గందరగోళంలో ఉందని ప్రభాకర్ అంటున్నారు. ఇప్పుడు ఏమి చెప్పి ఓట్లు అడగాలో తెరాస పెద్దలకు అర్థం కావటం లేదన్న ప్రభాకర్.. ఉద్యోగాల కల్పనపై చర్చకు రాకుండా కేటీఆర్ పారిపోయాడని ఎద్దేవా చేశారు.

ఉద్యోగాల కల్పనపై కేటీఆర్ కాకి లెక్కలతో కారుకూతలు కూస్తున్నాడని.. ఎమ్మెల్సీ ఎన్నికలు కేసీఆర్ ను కలవర పెడ్తున్నాయని.. కేటీఆర్ కు అర్థం కావటం లేదని ఎమ్మెల్సీ ఎన్నికలు భాజపాకు పూర్తి అనుకూలంగా ఉన్నాయని ప్రభాకర్ అన్నారు. ఇక వామనరావు దంపతుల హత్యలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని.. వామనరావు కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించకపోవటం మహానేరమని కూడా ప్రభాకర్ గుర్తు చేశారు. ఉద్యోగాల విషయంలో కేంద్రాన్ని విమర్శించే అర్హత  తెరాసకు లేదన్న ప్రభాకర్.. తెలంగాణ ప్రభుత్వ ఏడేళ్ళ పనితీరుకు ఎమ్మెల్సీ ఎన్నికలు రెఫరెండం అని తేల్చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: