హర్యానా రాష్ట్రంలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కొవాగ్జిన్‌, కోవిఫీల్డ్ వ్యాక్సిన్లను చోరీచేసిన ఒక దొంగ.. 12 గంటల లోపు టీకాలను తిరిగి ఇచ్చేశాడు. టీకాలను తిరిగి ఇవ్వడమే కాదు.. 'క్షమించండి.. తెలియక టీకాలను దొంగతనం చేశాను,' అనే ఒక క్షమాపణ నోట్ రాసి పెట్టడం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకవైపు లక్షల సంఖ్యలో కరోనా కేసులతో.. మరోవైపు వ్యాక్సిన్ కొరతతో భారతదేశం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఓ దొంగ పొరపాటున వ్యాక్సిన్లు దొంగలించి ఆ తర్వాత తన తప్పు తెలుసుకొని క్షమాపణ చెబుతూ తిరిగి ఇచ్చేసాడని జింద్ పోలీస్ అధికారులు చెబుతూ ఆ దొంగ సహృదయాన్ని మెచ్చుకుంటున్నారు.


వివరాలిలా ఉన్నాయి.. బుధవారం రోజు సాయంత్రం పూట జింద్ జనరల్ ఆస్పత్రి స్టోర్ రూమ్ నుంచి కొవాగ్జిన్‌, కోవిఫీల్డ్ వ్యాక్సిన్లు దొంగలించబడ్డాయి. అయితే దొంగతనం చేసిన వ్యక్తి ఏప్రిల్ 22 మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ ఎదుట టీ స్టాల్ లో ఉన్న ఒక ముసలాయనకు టీకాల బ్యాగ్ ను అందించి.. పోలీసులకు తాను ఆహారం అందజేస్తానని.. అత్యవసర పని వల్ల తాను వేరే చోటుకు వెళ్లాల్సి వస్తుందని.. అందుకే ఆ బ్యాగును పోలీసులకు ఇవ్వాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. దీంతో ఆ ముసలాయన ఆ బ్యాగ్ ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పాడు. తీరా పోలీసులు బ్యాగ్ తెరిచి చూడగా అందులో 1,710 కొవాగ్జిన్‌, కోవిఫీల్డ్ వ్యాక్సిన్లు కనిపించాయి. టీకాల తో పాటు ‘క్షమించండి.. ఇవి కరోనా టీకాలు అని నాకు తెలియదు’ అని రాసి ఉన్న ఒక ఉత్తరం కనిపించింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.



అయితే ఈ దొంగ రెమెడెసివిర్ వయల్స్ అని భావించి పొరపాటున టీకాలు దొంగలించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఆ దొంగ పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ఆ దొంగ రాసిన ఉత్తరం వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: