కరోనా కట్టడి, వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం అట్టర్ ఫ్లాప్ అని నిన్న ట్విట్టర్‌లో నిర్వహించిన ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో కుండ బద్దలు కొట్టేశారు. వ్యాక్సీన్ల విషయంలో మిగిలిన ప్రపంచ దేశాలు 2020మేలోనే మేలుకుని ఆర్డర్లు పెట్టకుంటే.. ఇండియా మాత్రం 2021 జనవరి వరకూ మీనమేషాలు లెక్కపెట్టిందని ఘాటుగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ తప్పుల వల్లనే దేశంలో టీకాల కొరత ఏర్పడిందని కేటీఆర్ మండిపడ్డారు. అసలు మన అవసరాలకు నిల్వ ఉంచకుండా ఎగుమతి చేయడం ఏంటని ప్రశ్నించారు.
అంతే కాదు.. టీకాలు తయారు చేసే సంస్థలకు అనుమతులు ఇవ్వడంలోనూ విపరీతమైన జాప్యం చేశారని గుర్తు చేశారు. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు సగం జనాభాకు టీకాలను ఇచ్చేశాయని.. కానీ ఇండియాలో కనీసం 10 శాతానికి కూడా వేయలేదని ఇది కేంద్రం వైఫల్యమేనని కేటీఆర్ అన్నారు. మన దేశంలోని సీరం , భారత్ బయోటెక్ నెలకి పది కోట్లకు మించి టీకాలను ఉత్పత్తి చేయలేవని కేటీఆర్ తెలిపారు. మరిదేశ జనాభాలో 80శాతం ఉన్న 18 నుంచి 45 సంవత్సరాల వయసు వారికి ఏ విధంగా రెండు డోసులు అందుతాయో మోడీ సర్కారే చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.
టీకాల పంపిణీ విషయంలో రాష్ట్రం తప్పేమీ లేదన్న కేటీఆర్.. టీకాలిస్తే రోజుకు పది లక్షల మందికి టీకాలు వేసే వ్యవస్థ ఉందని అన్నారు. కానీ ఆ మేరకు టీకాలు కేంద్రం నుంచి సరఫరా కావడం లేదని విమర్శించారు. అంతే కాదు.. కేంద్రం టీకాల విధానాన్ని కూడా కేటీఆర్ తప్పుపట్టారు. రాష్ట్రం పిలిచిన గ్లోబల్ టెండర్లకు స్పందన లేదని.. టీకాల విషయంలో కేంద్రమే ఓ నిర్ణయం తీసుకుని టెండర్లు పిలవాలని అన్నారు. మొత్తానికి కేటీఆర్ మోడీ సర్కారును తీవ్రంగా తప్పుబట్టారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి