పెట్రోల్‌ రేట్లు కొంత కాలంగా మండిపోతున్నాయి. ఇక ఇప్పుడైతే ఏకంగా పెట్రోల్ రేట్లు లీటర్‌కు సెంచరీ దాటిపోయింది. రోజుకో పావలా, పది పైసలు పెంచుతూ.. మోడీ సర్కారు తెలియకుండానే జనం నడ్డివిరుస్తోంది. పెట్రోల్‌ అంటేనే సమాజాన్ని నడిపించే ఇంధనం.. ఈ పెట్రోల్ అనే ఇంధనం లేకపోతే దేశంలో చాలా బండ్లు కదలవు.. ఏకంగా దేశ ఆర్థక రథమే నడవదు. ప్రస్తుతం పెట్రోలు ధర 100 దాటిపోయింది. డీజీల్ పరిస్థితీ ఇంచుమించు అంతే.. అందుకే ఈ ధరలు చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు.


దేశవ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంటే.. దేశంలో ఓ చోట మాత్రం పెట్రోల్‌ లీటర్ రూపాయికే అమ్మారు.  ఇదేదో బంపర్ ఆఫర్‌గా ఉందనుకుంటున్నారా.. అవును. అయితే.. అది మహారాష్ట్రలో. నిన్న  మహారాష్ట్ర సీఎం కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే పుట్టినరోజు. ఈ సందర్భంగా రూపాయికే లీటర్‌ పెట్రోల్‌ కార్యక్రమం చేపట్టారు ఆయన ఫ్యాన్స్.  ఠాణేలోని ఓ పెట్రోల్‌ బంకులో ఇలా రూపాయికే పెట్రోల్  అవకాశం కల్పించారు. రూపాయికే పెట్రోల్ అంటే జనం ఆగుతారా.. విషయం తెలియగానే వందల కొద్దీ వాహనదారులు క్యూ కట్టేశారు.


రాయితీ ఇచ్చే పెట్రోల్ బంకు దగ్గర బారులు తీరారు. అంతే.. ఈ బంకు ముందు కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపించాయి. ఈ ఒక్క పెట్రోల్‌ బంకులోనే కాదు.. మహారాష్ట్రలోనే అంబర్‌నాథ్‌ వింకో నకాలోని మరో పెట్రోల్‌బంక్‌లోనూ రాయితీ పెట్రోల్ ఇచ్చారు. అయితే మరీ రూపాయకే కాదండోయ్..  లీటరు పెట్రోల్‌ రూ.50కు అందించారు. అయితే ఈ ఆఫర్ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య వచ్చినవారికే ఇచ్చారు.


మరి ఇంతగా జనం పెట్రోల్‌ కోసం ఎగబడుతున్నారంటే.. రేట్ల పెరుగుదలపై జనం ఎంత అసౌకర్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మోడీ సర్కారు మాత్రం పెట్రోధరలను పెద్ద ఆదాయ వనరుగానే చూస్తోంది. అవును మరి.. పెట్రో ధరలపై కేంద్రానికి లభించే ఆదాయం ఆరేళ్లలో 300 శాతం పెరిగింది. అంతేకాదు.. ఈ లెక్కలు సాక్షాత్తూ కేంద్రమే పార్లమెంటులో చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో పెట్రోల్, డీజిల్ పై కేంద్రానికి రూ.2.94 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందట.


మరింత సమాచారం తెలుసుకోండి: