అమరావతిలో రైతుల ఉద్యమం ఇవాళ్టికి 550వ రోజుకు చేరింది. ఇలా ఉద్యమం ఓ మైలు రాయికి చేరినప్పుడల్లా అమరావతి ఉద్యమ కారులు ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. 550 రోజులు కావడంతో ఇవాళ కూడా ఆందోళనలు, ర్యాలీలు చేసే అవకాశం ఉంది. కొందరు రైతులు సీఎం ఇంటిని ముట్టడిస్తారనే సమాచారం కూడా ఉంది. అందుకే తాడేపల్లిలో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు.

ఏదేమైనా ఈ కరోనా వచ్చాక అమరావతి అమరావతి ఉద్యమం క్రమంగా జోరు తగ్గింది. నిరసనలకు, ఆందోళనలకు ఆస్కారం లేకుండా పోయింది. దీనికితోడు అమరావతి ప్రాంతంలో రైతులు కూడా కరోనా భయంతో ఆందోళనకు దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్లు మాస్కులు, శానిటైజర్లతో ఉద్యమం చేసినా.. ఆ తర్వాత దాన్ని కొనసాగించడం కష్టంగా మారింది.

కొన్నాళ్లుగా ఎవరి ఇళ్ల వద్ద వారే నిరసన తెలపాలని నిర్ణయించారు. కానీ.. ప్రస్తుతం అది కూడా అంతంత మాత్రంగానే సాగుతోంది. ఏవో కొన్ని మీడియా సంస్థలు తప్ప.. ఈ ఆందోళనలను ప్రెస్ కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఉద్యమం 550 రోజులకు చేరిన దృష్ట్యా మరోసారి ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఈ ఉద్యమానికి ఓ ముంగింపు దొరకడం మాత్రం చాలా కష్టంగానే ఉంది. ఎన్ని ఆందోళనలు చేసినా ముఖ్యమంత్రి జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదు.

మూడు రాజధానుల నిర్ణయాన్ని కొనసాగించేందుకే ఆయన సుముఖంగా ఉన్నారు. ఇప్పటికే విశాఖకు రాజధాని హంగులు అద్దుతున్నారు. ఆ మూడు రాజధానుల బిల్లు క్లియర్ అయినా కాకపోయినా.. జగన్ ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఏపీ సీఎం నివాసం తాడేపల్లి వద్ద ఇవాళ ఆందోళనకు రైతులు సిద్ధమయ్యారు. దీంతో ప్రాంతంలో హైటెన్షన్ నెలకొంది.

తాడేపల్లిలోని సీఎం నివాసం వద్ద భారీగా బలగాలు మోహరించారు. ప్రకాశం బ్యారేజీ, తాడేపల్లి వారధి, ఎన్టీఆర్‌ మార్గ్‌లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు అలర్టయ్యారు. తాడేపల్లి ప్రాంతంలో ఆందోళనలు, ర్యాలీలకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదు. అంతే కాదు.. అమరావతి ఉద్యమం జేఏసీ నేతల ఇళ్ల వద్ద కూడా పోలీసులు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: