ఏపీలో ఇప్పుడుప్పుడే ప్రతిపక్ష తెలుగుదేశం కాస్త పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటిన నేపథ్యంలో, ఆ పార్టీపై కాస్త వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది. అదే టీడీపీకి ప్లస్ అవుతున్నట్లు కనబడుతోంది. ముఖ్యంగా కొన్ని పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ ఎంపీలపై వ్యతిరేకత పెరిగిందని తెలుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఆ ఎంపీలు గెలవడం కష్టమని సర్వేలు వస్తున్నాయి.

అయితే వైసీపీ మీద వ్యతిరేకత ఉన్నా సరే కొన్ని పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి నాయకులు కూడా లేరు. అసలు చాలా స్థానాలకు ఇంచార్జ్‌లు లేరు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్లమెంట్ అధ్యక్షులుగా చేస్తున్న నాయకులు, నెక్స్ట్ ఎన్నికల్లో ఆయా పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ తరుపున బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  అందులో మొదటగా అరకులో గుమ్మడి సంధ్యారాణికి లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది.

2014లో సంధ్యారాణి టీడీపీ తరుపున పోటీ చేసి అరకులో ఓడిపోయారు. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున కిషోర్ చంద్రదేవ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక ఈయన అడ్రెస్ లేరు. దీంతో అరకు పార్లమెంట్ అధ్యక్షురాలుగా సంధ్యారాణి నియమితులయ్యారు. ఇక ఆమె వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుపున నిలబడుతారని తెలుస్తోంది. అటు గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఆడారి ఆనంద్, టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక ఆయన వైసీపీలోకి జంప్ కొట్టారు. దీంతో ప్రస్తుతం అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉన్న బుద్ధా నాగజగదీశ్వరరావు, నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేసి ఛాన్స్ ఉంది.

ఇటు కాకినాడలో ఓడిపోయిన చలమలశెట్టి సునీల్, వైసీపీలోకి జంప్ కొట్టారు. ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడుగా జ్యోతుల నవీన్ బాబు పనిచేస్తున్నారు. ఈయనే వచ్చే ఎన్నికల్లో కాకినాడ తరుపున పోటీ చేయొచ్చు. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున ఒంగోలులో పోటీ చేసి ఓడిపోయిన శిద్ధా రాఘవరావు వైసీపీలోకి జంప్ చేశారు. దీంతో ప్రస్తుతం ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడుగా పనిచేస్తున్న నూకసాని బాలాజీ, నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ తరుపున, పార్లమెంట్ స్థానంలో బరిలో దిగొచ్చు. మరి చూడాలి వీరిలో ఎవరికి లక్కీ ఛాన్స్ దొరుకుతుందో?  

మరింత సమాచారం తెలుసుకోండి: