దేశంలో ఏ సీఎం అమలు చేయని విధంగా సి‌ఎం జగన్, ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ చెప్పిన సమయానికి చెప్పిన విధంగా పథకాలు అందిస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో జగన్‌కు తిరుగులేదనే చెప్పొచ్చు. ఇక ఈ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా సి‌ఎం జగన్....రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో జగనన్న కాలనీల నిర్మాణాలు చేస్తున్నారు.

అయితే ఇందులో భాగంగా అర్హులైన 31 లక్షల మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కూడా పంపిణీ చేశారు. గ్రామాల్లో ఉన్నవారికి సెంటున్నర, పట్టణాల్లో ఉన్నవారికి సెంటు స్థలాన్ని ఇచ్చారు. అయితే ఈ సెంటు, సెంటున్నర స్థలాల్లో ఎంత ఇల్లు పడుతుంది.. ఈ ఇళ్ల స్థలాల్లో వైసీపీ నేతలు అక్రమాలు చేశారని ఆరోపణలు రావడం... అసలు కొన్ని స్థలాలు నిరుపయోగమని విమర్శలు రావడం...లాంటి అంశాలని పక్కనబెడితే...అసలు ఒక ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది? అని ఒక సామాన్యుడుని ప్రశ్నిస్తే...ఈరోజుల్లో ఒక ఇల్లు కట్టాలంటే కనీసం పది లక్షలు లేనిదే పని అవ్వదు అనే విధంగా పరిస్తితి ఉంది.

పోనీ సెంటు, సెంటున్నర భూముల్లో చిన్న ఇల్లు వస్తుంది కాబట్టి కనీసం 5-6 లక్షలు అయ్యే అవకాశం ఉంది. మరి ఆ స్థాయిలో ప్రభుత్వం నుంచి పేదలకు సాయం అందుతుందా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఒక ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చేది కేవలం లక్షా 80 వేలు మాత్రమే. మళ్ళీ ఇందులో కేంద్రం ఇచ్చేది లక్షా యాభై వేలు. అంటే రాష్ర్టం వాటా 30 వేలు. పైగా పావలా వడ్డీకి డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకు బ్యాంకుల నుంచి రూ.35 వేల రుణం ఇప్పిస్తారట. అంటే ఈ డబ్బులతో ఒక ఇంటి నిర్మాణం అయిపోతుందా? అంటే అవ్వదనే చెప్పొచ్చు. కాబట్టి ఈ విషయంలో జగన్ ప్రభుత్వం పునరాలోచించి ఇంటి నిర్మాణాలకు సాయం పెంచితే బాగుంటుందని పేద ప్రజలు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: