ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం డిసెంబరులో నిర్ణయించారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు అధికార పార్టీ నేతలు సమయం చూసి వదులుతున్న అస్త్రాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల అంశం కూడా తెరపైకి వచ్చింది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా నవరత్నాల అమలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారడం, రోజురోజుకు  ప్రజల్లో  పెరుగుతున్న వ్యతిరేకత, ప్రతిపక్షాల మధ్య క్రమంగా వస్తున్న భావసారూప్యత ఇవన్ని కూడా అధికార పార్టీకి తలనొప్పిగా మారాయి.  దీంతో వ్యతిరేకత పతాక స్థాయికి వెళ్లకముందే ముందస్తు ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుంది అనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఒక వేళ అలా వెళ్లాలని ఆలోచన ఉంటే డిసెంబరు నాటికి కొత్తమంత్రులు ప్రమాణం స్వీకారం చేయాల్సి ఉంటుంది. అందుకనే ఇప్పటినుంచే లెక్కలు వేయడం ప్రారభించారు.

ఇక ఇప్పడున్న మంత్రులను తొలగిస్తే అందులో కొంతమందిని పార్టీ పనులు కోసం ఉపయోగించుకోవాలని  సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు.  ఇదే సమయంలో అనేక మంది ఆశావాహులు కూడా తమ ప్రయత్నాలను ప్రారంభించారు. చంద్రబాబును ఎక్కువగా తిట్టడం, ఆయన ఇంటిపైకి దాడికి వెళ్ళడం, తెలుగుదేశం నేతలతో వీధిపోరాటాలకు సిద్ధపడి సీఎం జగన్‌ దృష్టిలో పడాలని  అనేకమంది ఎమ్మెల్యేలు తపన పడుతున్నారు.  అనుకూల  మీడియాలో ఫోకస్ అయ్యేందుకు తెగ తాపత్రయ పడిపోతున్నారు. సీఎంకు సన్నిహితంగా ఉండే నేతలు వద్ద లాబీయింగ్ ప్రారంభించారు.  ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగి తేలుతున్నారు.

మంత్రివర్గ పునర్వవస్థీకరణ  అనంతరం కొత్తగా వచ్చే కేబినెట్‌ .....ఎన్నికల మంత్రివర్గం అని నేతలే చెపుతున్నారు. ఇటీవల తనను కలిసిన ఒక ఎమ్మెల్యేతో ముఖ్యమంత్రి కూడా.. 2024 ఎన్నికలే మన టార్గెట్ అని అన్నారట. ఈ విషయాన్ని ఆ ఎమ్మెల్యే ఇతర ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. అంటే ముఖ్యమంత్రి తనకు సన్నిహితంగా ఉండే కొంతమంది నేతలు దగ్గర కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణపై లీకులు వదలడం ప్రారంభించారు.  ఈసారి టీములో సీనియర్లను కాకుండా యువకులు ముఖ్యంగా  తనకు విధేయులుగా ఉండే హర్డ్ కోర్ బ్యాచ్‌ను  సీఎం ఎంపిక చేసుకుంటారని పార్టీలోని నేతలు భావిస్తున్నారు.

ఇదిలావుంటే, ఇప్పటికే  కేబినెట్‌లో ఉన్న కొంత మంది సీనియర్లు అప్పుడప్పుడు తల ఎగరవేయడం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఎంతమాత్రం నచ్చడం లేదట. మరోవైపు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి బాంబు పేల్చారు. అయినప్పటికీ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. జగన్‌ సర్కారుపై చేసిన విమర్శల వేడిలో మంత్రి బాలినేని చేసిన సంచలన వ్యాఖ్యలు తేలిపోయాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: