ఏపీలో టీడీపీ నేతల జీవితాలు దుర్భరంగా మారాయి. ప్రత్యేకించి పార్టీలో దూకుడుగా ఉండే నాయకులను వైసీపీ సర్కారు టార్గెట్ చేస్తోందన్న ఆందోళన కనిపిస్తోంది. తాజాగా టీడీపీ నేత పట్టాభి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో బంద్‌కు పిలుపు ఇవ్వడంతో అనేక మంది టీడీపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. అలాంటి వారిలో టీడీపీ యువనేత బ్రహ్మం చౌదరి ఒకరు. అయితే.. ఆ టీడీపీ నేతను పొద్దున అరెస్టు చేశారు.. ఇంకా విడుదల చేయలేదు.. దీంతో పార్టీ నాయకుల్లో ఆందోళన కనిపిస్తోంది.


ఉదయం అరెస్టు చేసిన బ్రహ్మం చౌదరి ఆచూకీ  అర్ధరాత్రి అయినా తెలియకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. బ్రహ్మంపై వైసీపీ నేతలు, పోలీసులు కలిసి కుట్ర పన్నారనిపిస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. నాదెండ్ల బ్రహ్మంకు ఏదైనా జరిగితే డీజీపీ, ముఖ్యమంత్రిదే బాధ్యత అని ముందుగానే హెచ్చరిస్తున్నారు. వైసీపీ నేతలతో కుమ్మక్కయి టీడీపీ నేతల్ని ఇబ్బందులు పెడుతున్న పోలీసులకు భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని టీడీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు.


నాదెండ్ల బ్రహ్మం చౌదరిని పోలీసులు వెంటనే విడుదల చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మంను పోలీసులు ఇంకా  విడిచిపెట్టలేదని అచ్చెన్నాయుడు అన్నారు. ఉదయం ఉండవల్లిలో బ్రహ్మం చౌదరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రోజంతా పలు స్టేషన్ లు తిప్పుతున్నట్లు సమాచారం ఉందని అచ్చెన్నాయుడు అన్నారు. రాత్రి అయినా బ్రహ్మం ఆచూకీ లభించక పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని అచ్చెన్నాయుడు వివరించారు.


టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ రౌడీమూకల దాడికి నిరసనగా టీడీపీ నిర్వహించిన రాష్ట్ర బంద్‌లో శాంతియుత నిరసన తెలిపేందుకు బ్రహ్మం వచ్చారని.. ఆయన్ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు అచ్చెన్నాయుడు. ఉదయం అరెస్టు చేసిన పోలీసులు అర్ధరాత్రి అయినా బ్రహ్మంను విడుదల చేయలేదని.. కనీసం ఎక్కడున్నాడో తెలపకుండా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు అచ్చెన్నాయుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: