టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏం చెబుతారు..?  ఏం చేస్తారు?  భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ఏంటి?  ఇదీ..ఇప్పుడు టీడీపీ నేత‌ల మ‌ధ్య ఆస‌క్తిగా మారిన విష‌యం. ప్ర‌స్తుతం 36 గంట‌ల దీక్ష‌లో ఉన్న చంద్ర‌బాబు శుక్ర‌వారం రాత్రి 8 గంట‌లకు దీక్ష విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న టీడీపీ నేత‌ల‌ను.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడ‌నున్నారు. పార్టీ కార్యాల‌యంపై వైసీపీ నేత‌లు చేసిన దాడికి నిర‌స‌న‌గా.. చంద్ర‌బాబు గురువారం ఉద‌యం 8 గంట‌ల‌కు దీక్ష చేప‌ట్టారు. మొత్తం 36 గంట‌ల పాటు ఆయ‌న దీక్ష చేయ‌నున్నారు. ఇక‌, దీక్ష‌ను ప్రారంభించే స‌మ‌యంలోనే ఆయ‌న కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

డీజీపీని.. ముఖ్య‌మంత్రిని కూడా ఆయ‌న హెచ్చ‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ శాంత స్వ‌రూపాన్నే చూశా ర‌ని.. ఇక నుంచి మాత్రం త‌మ విశ్వ‌రూపం చూస్తార‌ని..చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. అంతేకాదు.. పార్టీని కూడా దూకుడుగా ముందుకు తీసుకువెళ్తామ‌న్నారు. అదేస‌మ‌యంలో రాష్ట్రంలో జ‌రుగుతున్న అరాచ‌క పాల‌న‌పై తాము కేంద్రానికి ఫిర్యాదులు చేస్తామ‌న్నారు. ఇక‌, న్యాయ పోరాటం కూడా చేస్తామ‌ని చెప్పారు. అదేవిధంగా ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పైనా పోరాటం చేస్తామ‌ని చెప్పారు. ఇక‌, ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ముఖ్యంగా ఆయ‌న రాబోయే రోజుల్లో త‌మ సీరియ‌స్‌నెస్ చూస్తార‌ని చెప్పిన ద‌రిమిలా.. ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది ఆస‌క్తిగా మారింది.

ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ముందు మూడు ల‌క్ష్యాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి.. పార్టీని అధికారంలోకి తీసుకురా వ‌డం.రెండు త‌న కుమారుడిని వార‌సుడిగా ప్ర‌క‌టించ‌డం.. మూడు.. పార్టీ నేత‌ల‌ను ఏక‌తాటిపై న‌డిపించ డం. అదేస‌మ‌యంలో వైసీపీ దూకుడుకు క‌ళ్లెం వేయ‌డం. అయితే.. ఇవ‌న్నీ సాధించాలంటే.. ఆయ‌న ప్ర‌జ‌ల్లో సానుభూతిని సొంతం చేసుకోవాలి. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు సానుభూతి పెరిగిన దాఖ‌లా క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల్లో నిత్యం ఉండేలా.. ఆయ‌న ప్లాన్ చేసుకుంటున్నారు. దీనిపై ఈ రోజు శుక్ర‌వారం ఆయ‌న దీక్షవిర‌మ‌ణ సంద‌ర్భంగా చేసే ప్ర‌సంగంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తార‌ని అంటున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల‌ను బ‌ట్టి.. చంద్ర‌బాబు.. ఈ నెల ఆఖ‌రు లేదా.. న‌వంబ‌రు నుంచి బ‌స్సు యాత్ర‌కు శ్రీకారం చుట్టే అవ‌కాశం ఉంది. అదేస‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన నాయ‌కుల‌కు విస్తృత అధికారాలు ఇచ్చి.. పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటారు. త‌న కుమారుడిని ఇప్ప‌టికిప్పుడు వార‌సుడిగా ప్ర‌క‌టించే నిర్ణ‌యం వాయిదా వేసుకుని.. తిరిగి త‌నే.. సుప్రీం అనే వాద‌న‌ను బ‌లంగా తీసుకువెళ్లే ప్ర‌తిపాద‌న‌ను తీసుకుంటారు. అదేస‌మ‌యంలో క‌లిసి వ‌చ్చే పార్టీల‌తో ఆయ‌న కూట‌మికి రెడీ అవుతారు. ఏదేమైనా.. తాజాగా దీక్ష విర‌మ‌ణ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఫ్యూచ‌ర్ ప్లాన్ చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: