పార్టీ మారాలంటూ.. ఒక‌వైపు ఒత్తిళ్లు.. మార‌క‌పోతే.. మూసేస్తాం.. అంటూ.. వ్యాపారాల‌పై ఆదేశాలు.. ఈ రెండింటి మ‌ధ్య న‌లిగిపోయినప్ప‌టికీ.. న‌మ్మిన సిద్ధాంతాల‌కు క‌ట్టుబడిన నాయ‌కుడుగా.. న్యాయ పోరాటం చేసి.. అధికారుల దూకుడు.. రాజ‌కీయాలపై విజ‌యం సాధించారు ప్ర‌కాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి కుమార్‌. రాజ‌కీయాల్లో ఇటీవ‌ల కాలంలో.. సాన‌దాన భేద దండోపాయాలు పెరిగిపోయాయి. బ‌ల‌మైన నాయ‌కులు.. ముఖ్యంగా.. ఓ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుల‌పై అధికార ప‌క్షం నుంచి ఒత్తిళ్లు పెరిగాయ‌నేది నిర్వివాదాంశం.
ఇక్కడ నాయకుల‌పై ప్రేమ అనేక‌న్నా.. ఒక పార్టీని అంతం చేయాల‌నేది సిద్ధాంతంగా న‌డుస్తున్న విష యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే గ‌తంలో వైసీపీలో ఉండి.. త‌ర్వాత టీడీపీలోకి వ‌చ్చిన గొట్టిపాటి ర‌వి కుమార్‌.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీ ఉన్న‌ప్ప‌టికీ.. విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తిరిగి వైసీపీ గూటికి రావాలంటూ.. ఒత్తిళ్లు వ‌చ్చాయి. ఆర్థిక మూలాల‌పై దెబ్బ కొట్టే చ‌ర్య‌లు కూడా జ‌రిగాయి. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న గ్రానైట్ కంపెనీపై దాడులు.. 50 కోట్ల మేర‌కు  ఫైన్ వంటివి వేశారు. అయిన‌ప్ప‌టికీ.. రాజ‌కీయంగా ఒత్తిళ్ల‌కు లొంగ‌కుండా.. తాను న‌మ్మిన సిద్ధాంతం మేర‌కు.. టీడీపీలోనే ఉన్నారు గొట్టిపాటి.
ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం చేసిన టార్గెట్‌ను ఆయ‌న న్యాయ‌ప‌రంగా ఎదుర్కొన్నారు. రాష్ట్ర హైకోర్టు.. త‌ద‌నంత‌రం సుప్రీం కోర్టులోనూ.. న్యాయ పోరాటం చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌నకు తాజాగా ఊర‌ట ల‌భించింది.  గ్రానైట్ కంపెనీ మూసివేతకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుపై సుప్రీం కోర్టు  స్టే  విధించింది. ఈ కేసును విచారించిన‌ సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం.. స్టే విధిస్తూ.. సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. వాస్త‌వానికి రాజ‌కీయ కక్ష‌ల నేప‌థ్యంలోనే గొట్టిపాటిని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టేందుకు.. అధికారులు నోటీసులు ఇచ్చార‌నేది వాస్త‌వం.
 గొట్టిపాటి గ్రానైట్ కంపెనీలో అవకతవకలు జరిగాయంటూ విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చింది. దీనిలో భాగంగానే రూ.50 కోట్ల జరిమానాకు సిఫారసు చేసింది. అయితే.. దీనిని గొట్టిపాటి హైకోర్టులో ఇంత‌కు ముందే సవాల్ చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వ షోకాజ్ నోటీసును   హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేశారు. అయితే.. ఈ ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్  ప‌క్క‌న పెట్టి.. గొట్టిపాటికి వ్య‌తిరేకంగా తీర్పు చెప్పింది. దీంతో ఆయ‌న ఈ ఆదేశాలను సుప్రీంలో సవాలు చేశారు.
ఈ క్ర‌మంలో గ్రానైట్ కంపెనీలలో అవకతవకలపై విజిలెన్స్ సిఫారసులు చట్ట విరుద్ధమని వాదించిన ఎమ్మెల్యే గొట్టిపాటి తరపు న్యాయవాదుల వాద‌న‌ల‌ను సుప్రీం కోర్టు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. దీంతో ఏపీ ప్రభుత్వ షోకాజ్ నోటీసుపై స్టే విధించింది. ఫ‌లితంగా .. గొట్టిపాటికి భారీ ఊర‌ట ల‌భించ‌డంతోపాటు.. ప్ర‌భుత్వానికి ఒక లెస్స‌న్ చెప్పిన‌ట్టు ఉంద‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: