హస్తినకు పోయి రావాలి అనే కాన్సెప్ట్ తో చంద్రబాబు అండ్ కో ఢిల్లీ వెళ్లిందా..? దాదాపు రెండేళ్ల తర్వాత ఢిల్లీ వెళ్లిన ఆయన ఏదైనా సాధిస్తారా..? ఈ సమయంలో టీడీపీ అధినేత తీసుకున్న నిర్ణయం  పై పార్టీలో జరుగుతున్న చర్చేంటి..? టిడిపి ఆఫీస్ పై  దాడి చేశారనే అంశంపై ఒక రోజు రాష్ట్ర బందుకు పిలుపునిచ్చి మరో రెండు రోజులు దీక్ష చేపట్టిన చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఏపీలో అరాచకం రాజ్యమేలుతుందని ఆరోపిస్తూ ఆ విషయాన్ని కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకు వెళ్తామని టిడిపి నేతలు చెప్పారు.

అయితే అమిత్ షా అపాయింట్మెంట్ లభించకపోవడంతో  రాష్ట్రపతి దగ్గరకు వెళ్లారు నాయకులు. ఇటీవల జరిగిన సంఘటనలు  బీజేపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న టిడిపిపై దాడి దీని వెనక వైసిపి ఉందనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసేలా వివరాలను రాష్ట్రపతికి తెలిపారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టే పరిస్థితులు ఉన్నాయని రామ్ నాథ్ కోవింద్ దృష్టికి తీసుకెళ్ళింది  చంద్రబాబు బృందం. అలాగే డ్రగ్స్ కు అడ్డాగా ఏపీ మారుతుందనే అంశాన్ని ప్రస్తావించారు నాయకులు. ఇంత వరకు బాగానే ఉన్నా చంద్రబాబు ఢిల్లీ టూర్ పై ఇప్పుడు ఇంకోలా చర్చ జరుగుతోందట. రెండేళ్ళ తర్వాత ఢిల్లీకి వెళితే అదీ రాష్ట్రపతిని కలిస్తుంటే దానికి బలమైన కారణం ఉండాలి. ప్రజా సమస్యలు, అవినీతి లేదా రాష్ట్ర ప్రయోజనాలలో ఎజెండాలు ప్రస్తావించాలి. కానీ పార్టీ ఆఫీస్ పై దాడి చేశారు దీనికి అధికార పార్టీ సహకరించింది, ఆ దాడికి పోలీసులు సహకరించారనే ఆరోపణలే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని రాష్ట్రపతిని కలవడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. పోలవరం, అమరావతి, ప్రత్యేక హోదా, విభజన సమస్యలు తదితర కీలక అంశాలు చాలా ఉన్నాయి. వాటిని కాదని టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగిందనే విషయాన్ని బేస్ చేసుకుని వెళ్తే ఇదేదో ఏపీ లోని రాజకీయాలను రాష్ట్రపతికి బ్రీఫ్ చేయడానికి వెళ్లినట్లుగా ఉందని సెటైర్లు వేస్తున్నారట. దీనివల్ల పార్టీకి మైలేజ్ వచ్చే సంగతి అటుంచి, విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందని ఆందోళన  చెందుతున్నారట.

పార్టీ కార్యాలయం అని కాకుండా, మత్తుపదార్థాల సరఫరాకు ఏపీ కేరాఫ్ అడ్రస్ గా మారిందనే విషయాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడానికే తాము హస్తిన బాట పట్టామనేది టిడిపి వాదన. కానీ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో జనాలకు తెలిసిపోయింది. ఈ సమయంలో అది కాదు ఇది కాదు అని ఎంత అరిచి గీ పెట్టినా ప్రజల అటెన్షన్ కష్టమే. దీంతో రానున్న రోజుల్లో చంద్రబాబు ఢిల్లీ టూర్ పై ఎదురయ్యే రాజకీయ విమర్శలపై  అంచనా వేసే పనిలో పడ్డారట కొందరు నాయకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: