తిరుపతి నగరం కూడా పూర్తిగా జలమయం అయ్యింది. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లోని భారీవర్షాల పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో ఇప్పటికే ఓ సారి మాట్లాడిన జగన్ మరోమారు సమీక్షించారు. రిజర్వాయర్లలో చెరువుల్లో ఎప్పటికప్పుడు నీటిమట్టాలను గమనించుకుంటూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతిలో పరిస్థితులపై చిత్తూరు కలెక్టర్‌తో మాట్లాడిన సీఎం.. అవసరమైన చోట్ల వెంటనే సహాయ శిబిరాలను తెరవాలని ఆదేశించారు.
సహాయ శిబిరాల్లో అన్నిరకాల వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.. సహాయ శిబిరాల్లో ఉన్నవారికి రూ. వేయి రూపాయల చొప్పున తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతిలో సహాయక చర్యలు కోసం సంబంధిత శాఖలన్నీ వెంటనే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. అవసరమైనంత మేరకు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకోసం తగినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
నిధుల కోసం ఎక్కడా రాజీపడాల్సిన అవసరంలేదన్న సీఎం.. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు వివరాలు అందించాలని తెలిపారు. ఏం కావాలన్న వెంటనే కోరాలని, తాను నిరంతరం అందుబాటులో ఉంటానని సీఎం తెలిపారు. శాఖాధిపతులు.. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి