ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకుంటామని చెప్పిన జగన్ ... ఈ బిల్లు లోపభూయిష్టంగా ఉండటం తో పాటు , న్యాయపరమైన చిక్కుల్లో ఉండడంతో దాని స్థానంలో మ‌రో స‌మ‌గ్ర‌మైన కొత్త బిల్లును తీసుకువస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే మూడు రాజధానులు పైనే త‌మ స్టాండ్ కూడా ఉంటుందని కూడా క్లారిటీ
ఇచ్చేశారు.

అయితే అన్ని ప్రాంతాల ప్రజల ఆశలు , ఆకాంక్షలను తెలుసుకొని దానికి అనుగుణంగానే కొత్త బిల్లును తీసుకొస్తామని హామీ ఇచ్చారు. చట్టపరంగా , న్యాయ ప‌రంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈసారి బిల్లును స‌భ ముందుకు తీసుకు వ‌స్తామ‌ని జగన్ చెప్పారు. తెలంగాణకు హైదరాబాద్ లా , కర్ణాటకకు బెంగళూరు లా, తమిళనాడు చెన్నై లా ... మనకు కూడా ఒక మంచి సిటీ కావాలని కోరారు. మన పిల్లలు కూడా ఇతర నగరాలకు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు.

ఈ క్రమంలోనే అన్ని అవకాశాలు ఉన్న విశాఖ‌ను అభివృద్ధి చేస్తామంటూ హింట్ ఇచ్చారు. జగన్ చేసిన ప్రసంగాన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పూర్తిగా విశాఖపట్నం ను చేస్తారా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పేరుకు మాత్రం మూడు రాజధానులు ఉన్నా కూడా పరిపాలన తో పాటు సచివాలయం , అసెంబ్లీ అంతా విశాఖలోనే ఉండబోతుంది.

ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో అమ‌రావ‌తి లో కోట్లాది రూపాయ‌లు పెట్టి అక్క‌డ అభివృద్ధి చేయ‌డం క‌ష్ట‌మే అన్న భావ‌న జ‌గ‌న్ మాట‌ల్లో క‌నిపించింది. ఇప్ప‌టికే ఎంతో అభివృద్ధి చెందిన వైజాగ్‌ను డ‌వ‌ల‌ప్ చేసుకుంటే స‌రిపోతుంద‌ని జ‌గ‌న్ చెప్ప‌క‌నే చెప్పేశారు. ఈ లెక్క‌న అమ‌రావ‌తి ప్ర‌జ‌ల ఏకైక  రాజ‌ధాని ఆశ‌లు నెర‌వేరేలా క‌న‌ప‌డ‌డం లేదు. మ‌రి  ఈ విష‌యం ఇంకెంత ముందుకు వెళుతుందో ?  కూడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: