ఏపీలో ఒక్క‌సారిగా చెల‌రేగిన చిరు-సీఎం జ‌గ‌న్‌ల మ‌ధ్య సాగిన మంత్రాంగం వివాదం టీ క‌ప్పులో తుఫాను మాదిరిగా స‌ర్దు మ‌ణిగిందా?  ఇక‌, ఈ వివాదానికి ఇక్క‌డితో ఫుల్ స్టాప్ ప‌డిందా? అంటే.. కొంద‌రు ఔన‌నీ చెప్ప‌డం లేదు. కాద‌నీ చెప్ప‌డం లేదు. దీనికి కార‌ణం.. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి వైనా జ‌ర‌గొచ్చ‌ని.. ఎవ‌రి అవ‌స‌రం.. ఎవ‌రి అవ‌కాశం అనేదే ప్ర‌ధానంగా కీ రోల్ అవుతుంద‌ని అంటున్నారు. సీఎం జ‌గ‌న్‌తో చ‌ర్చ‌ల కోసం.. చిరంజీవి.. హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో వ‌చ్చారు. భోజ‌న విరామంలో చ‌ర్చించుకున్నారు. బ‌య‌ట‌కు వ‌చ్చిన చిరు.. సినీ ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాన‌ని చెప్పారు.

త్వ‌ర‌లోనే అవి ప‌రిష్కారం అవుతాయ‌ని అన్నారు. అయితే.. ఏయే స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు? ఏయే స‌మాధానాలు రాబ‌ట్టారు. సీఎం నుంచి ఎలాంటి హామీలు వ‌చ్చాయి. అనే విష‌యాల‌పై మాత్రం చిరు ఎక్క‌డా ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. దీంతో ఆయ‌న రాజ్య‌స‌భ సీటు కోస‌మే వ‌చ్చార‌ని వార్తలు వ‌చ్చాయి. అయితే.. ఈ దుమారం పెర‌గకముందే.. చిరు అలెర్ట్ అయ్యారు. తాను రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నాన‌ని.. త‌న‌కు రాజ్య‌స‌భ సీటుపై వ్యామోహం లేద‌ని.. చెప్పుకొచ్చారు. అంతేకాదు.. త‌న‌ను రాజ‌కీయాల్లోకి లాగొద్ద‌ని.. మీడియా త‌న వ్యాఖ్య‌ల‌ను.. త‌న ప‌ర్య‌ట‌న‌ను వ‌క్రీక‌రించొద్ద‌ని చిరు విజ్ఞ‌ప్తి చేశారు.

దీంతో ప్ర‌స్తుతానికి చిరు వివాదం ఆగిన‌ట్టే క‌నిపించింది. అయితే.. విశ్లేష‌కులు మాత్రం గ‌తంలో జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌ల‌ను తెర‌మీదికి తెస్తున్నారు. ``గ‌తంలో ప్ర‌జారాజ్యం పెట్టిన ప్పుడు కూడా.. ఒక తెలుగు మీడియా సంచ‌ల‌న‌ క‌థ‌నం రాసింది. `జెండా పీకేద్దాం!`` టైటిల్‌తో వ‌చ్చిన క‌థనంలో ప్ర‌జారాజ్యాన్ని తీసేస్తున్నార‌ని.. చిరంజీవి పార్టీని న‌డ‌ప‌లేక పోతున్నార‌ని రాశారు. అయితే.. అప్ప‌ట్లో ఈ క‌థ‌నాన్ని ఖండించ‌డంతోపాటు.. దీనిపై చిరు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.కానీ, ఆరు మాసాలు గ‌డిచేస‌రికి పార్టీ ని కాంగ్రెస్‌లో క‌లిపేశారు.

ఇక‌, త‌ర్వాత కూడా .. ఆయ‌న సినిమాల‌కు దూరంగా ఉంటాన‌ని చెప్పారు. కానీ, త‌ర్వాత మ‌న‌సు మార్చుకోలేదా?  ఇప్పుడు కూడా అంతే! రాజ్య‌స‌భ టికెట్‌ను పిలిచి ఇస్తే.. తీసుకోని వారు ఎవ‌రు ఉంటారు? `` అని ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో ఈ వివాదం ఇప్పుడు స‌ర్దుమ‌ణిగినా.. మ‌ళ్లీ తెర‌మీదికి రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: