తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న అర్జంట్‌గా పార్టీ ముఖ్య నేతలతో తన ఫామ్‌ హౌజ్‌లో సమావేశం అయ్యారు. ముఖ్యమైన నేతలు అర్జంట్‌గా పిలిపించుకుని మరీ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై మరోసారి ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధం కావాలని పార్టీ నాయకులకు కేసీఆర్ చెప్పారు. దీనిపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు రేపు కార్యాచరణ ఖరారు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో మంత్రుల బృందం డిల్లీ వెళ్లాలని కూడా నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్రం పూర్తిగా సేకరించేలా పోరాడాలని కేసీఆర్ పార్టీ నేతలకు స్పష్టం చేశారు.


ఎర్రవల్లిలోని తన ఫామ్‌ హౌజ్‌లో మంత్రులు, అధికారులతో నిన్న కేసీఆర్‌ అత్యవసరంగా భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో కేంద్రంపై దేశ రాజధాని వరకు పోరాటం చేయాలని కేసీఆర్ మంత్రులకు స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారుపై చర్చ కోసం రేపు టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాఅధ్యక్షులు, జెడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు, కార్పోరేషన్ల ఛైర్మన్లు అంతా తప్పనిసరిగా రావాలని కేసీఆర్ ఆదేశించారు.


ఈ భేటీ ప్రకారం.. తెలంగాణలో పండిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కచ్చితంగా కొనుగోలు చేయాలని మరోసారి పోరాటం ఉధృతం చేయబోతున్నారు. ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ టీమ్‌ ఢిల్లీ వెళ్తుంది. ధాన్యం కొనుగోళ్ళ అంశంపై  కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.  అవసరమైతే.. అవకాశం లభిస్తే ప్రధానిని కూడా కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా పార్లమెంట్ లోనూ టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారు.


మొత్తానికి మరోసారి కేంద్రంపై పోరాటం అంశాన్ని కేసీఆర్‌ పార్టీలో మరోసారి చర్చకు పెట్టారు. ఎలాగూ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఇకపై తెలంగాణలో ఈ రాజకీయం మరింత జోరందుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: