జగన్ కొత్త కేబినెట్ కొలువుదీరింది. మాజీలు, తాజాలు.. అందరికీ శాఖల కేటాయింపులు కూడా పూర్తయ్యాయి. అయితే అనుకున్నదానికంటే ఎక్కువగా జగన్ కి అసంతృప్తి సెగ తగిలింది. టీడీపీ కూడా ఈ స్థాయిలో జగన్ జట్టులో సెగలు, పొగలు రేగుతాయని అంచనా వేయలేదు. మంత్రులందర్నీ తప్పిస్తే ఇక మాట్లాడేవారెవరుంటారని అనుకున్నారు. కానీ జగన్ 11మందిని కొనసాగించడంతో పరిస్థితి తారుమారయింది. మిగిలిన వారంతా తమ ప్రతాపం చూపించాలనుకున్నారు, కొంతమంది చూపించారు కూడా. సహజంగా ఈ దశలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తరపున మాటల తూటాలు పేలేవి. కానీ చంద్రబాబు మాత్రం కాస్త వేచి చూసే ధోరణిలో ఉన్నారు.

జగన్ కొత్త కేబినెట్ పై టీడీపీ తరపున కొంతమంది మాట్లాడినా, నేరుగా చంద్రబాబు మాత్రం స్పందించలేదు. అయితే బీసీల విషయంలో మాత్రం ఆయన పరోక్షంగా స్పందించారు. బీసీలకు అండగా నిలబడింది టీడీపీయేనని గుర్తు చేశారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు చేశారు. సమ సమాజ స్థాపనకు, విద్యా వ్యాప్తికి పూలే కృషి చేశారని, వాటి కోసమే ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు బాబు. పూలే వంటి మహనీయుల ఆశయ స్ఫూర్తితోనే టీడీపీ పుట్టిందని, వెనకబడిన వర్గాలు, కులాల్లో రాజకీయ చైతన్యం రగిల్చిందని చెప్పారు. వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ పురోగతికి టీడీపీ 40 ఏళ్లుగా కృషి చేస్తోందని అన్నారు బాబు. టీడీపీ నుంచి బీసీలను ఎవరూ విడదీయలేరని అన్నారు. తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ అని చెప్పారు బాబు.

కొత్త మంత్రి వర్గంలో జగన్ బీసీలకు పెద్ద పీట వేశారు. అదే సమయంలో చంద్రబాబు.. తమది అసలు సిసలైన బీసీ పార్టీ అంటున్నారు. మొత్తమ్మీద ఇద్దరు నాయకులు, రెండు ప్రధాన పార్టీలు బీసీలను దగ్గరకు చేర్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఏపీలో బీసీ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నా.. వారికి కీలక పదవులు దక్కడం మాత్రం అరుదు. అధికారం ఇచ్చినా, మంత్రి పదవులు కట్టబెట్టినా పెత్తనం మాత్రం వేరేవారి చేతుల్లోనే ఉంటుంది. టీడీపీ అయినా, వైసీపీ అయినా పైకి కనపడేది ఒకటయితే, లోపల జరిగేది ఇంకొకటి. అంతమాత్రాన బీసీలను వారు నిర్లక్ష్యం చేశారని చెప్పలేం కానీ, సంక్షేమ పథకాలతో వారికి చేయూతనిస్తున్నారు. అయితే తమదే అసలైన బీసీ పార్టీ అని, తామే బీసీ ఉద్ధారకులమని చెప్పుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో జగన్ తాజా మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ కూడా బీసీల చుట్టూ తిరిగిందనే చెప్పాలి. మొత్తమ్మీద నేరుగా జగన్ కొత్త కేబినెట్ పై స్పందించకుండా, పరోక్షంగా బీసీల పార్టీ తమది అని చెప్పుకున్నారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: