ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన  స్టేట్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్రమోషన్‌ బోర్డు  సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో కృషక్‌ భారతి కో–ఆపరేటివ్‌ లిమిటెడ్‌ క్రిబ్కో ఆధ్వర్యంలో రెండు విడతల్లో బయో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. రూ.560 కోట్లతో 250 కె.ఎల్‌.డి. సామర్థ్యంతో ప్లాంట్‌ ఏర్పాటునకు ఆమోదం తెలిపారు.  100 ఎకరాల్లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది క్రిబ్‌కో సంస్థ.. దీంతో 400 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.


ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని విత్తనశుద్ధి సహా వివిధ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని క్రిభ్‌కో సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ పాలసీ 2022–27లో మరిన్ని చర్యలు తీసుకుంది. ఇప్పుడున్న ఎగుమతులను 5 ఏళ్లలో రెట్టింపు చేసే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించింది. ఐదేళ్ల కాలంలో రూ.3.5 లక్షల కోట్లు ఎగుమతులు సాధించాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది.


ఇందులో భాగంగా పలు నిర్ణయాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ లాజిస్టిక్స్‌ పాలసీ 2022–2027లో భాగంగా మరిన్ని ప్రోత్సాహకాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. రాష్ట్రం నుంచి అధికంగా ఆక్వా రంగం నుంచి ఎగుమతులు ఉన్నాయన్న సీఎం జగన్.. ఆక్వా ఉత్పత్తుల క్వాలిటీ పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్బీకేల ద్వారా ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు.


అలాగే విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఇవి త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. దేశంలో మెరైన్‌ ఎగుమతుల్లో 46శాతం రాష్ట్రం నుంచే ఉన్నాయన్న  సీఎం.. ఈ రంగాన్ని తగిన విధంగా ప్రోత్సహించాలని సూచించారు. సింగిల్‌ డెస్క్‌ పద్ధతిలో పరిశ్రమలకు అనుమతుల విధానంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. అత్యంత పారదర్శక విధానాల్లో భాగంగా ఈ మార్పులను తీసుకు వచ్చామని సీఎం జగన్ అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: