ఇపుడు పరిస్ధితి ఎలాగ ఉందంటే సకల దరిద్రాలకు మూలకారణం మొబైల్ ఫోనే అన్నట్లుగా తయారైంది. ఊపిరి తీయటం అయినా మరచిపోతారేమో కానీ మొబైల్ ఫోన్ను మాత్రం చేతిలో నుండి పక్కనపెట్టడంలేదు. దీని దుష్ప్రభావం ఎక్కువగా చిల్లపిల్లల్లో కనబడుతోంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. అదేమిటంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో నో సెల్ ఫోన్ అని. విద్యార్ధులు స్కూళ్ళకు సెల్ ఫోన్లు తేవటాన్ని ప్రభుత్వం నిషేధించింది.





టీచర్లకు కూడా ఉత్తర్వులు వర్తిస్తాయి. కాకపోతే టీచర్లు తమ మొబైల్ ఫోన్లను హెడ్ మాస్టర్ దగ్గర డిపాజిట్ చేయాల్సుంటుంది. అది కూడా సైలెంట్ మోడ్ లో పెట్టేయాలి. అసలు ఇంటిదగ్గరే మొబైల్ ఫోన్లను పెట్టేసొస్తే ఇంకా మంచిది. పాఠాలు చెప్పటానికి టీచర్లకు, వినటానికి విద్యార్ధులకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదనే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నది. పాఠాలు చెప్పాల్సిన టీచర్లు, వినాల్సిన విద్యార్ధులు సెల్ ఫోన్ల వాడకంలోనే ముణిగిపోతున్నారని ఒక అధ్యయనం బయటపెట్టింది.





పాఠాలు చెప్పటంలో కన్నా, వినటంలో కన్నా టీచర్లు, విద్యార్ధులు సోషల్ మీడియాలోనే ఎక్కువగా ముణిగిపోతున్నారని ప్రభుత్వం తన సర్క్యులర్లో చెప్పింది. ముందు టీచర్లు పద్దతిగా ఉంటే తర్వాత విద్యార్ధులు కూడా దారికి వస్తారన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని కూడా ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే ఇలాంటి నిబంధనలను కొన్ని ప్రైవేటు స్కూళ్ళు అమలుచేస్తున్నాయి. టీచర్లను మొబైల్ ఫోన్లు ఉపయోగించకుండా చాలా స్ట్రిక్టుగా నిబంధనలు విధించాయి.





విద్యార్ధుల్లో కూడా అవసరార్ధం తల్లి, తండ్రులు మొబైల్ ఫోన్లను ఇచ్చేస్తుండం, ఇంటర్నెట్ కూడా చవకగా అందుబాటులోకి వచ్చేయటంతో చాలామంది విద్యార్ధులు విచ్చలవిడితనానికి అలవాటుపడిపోతున్నారు. విద్యార్ధుల్లోని విపరీత ధోరణులకు చాలావరకు మొబైల్ ఫోన్లే కారణమని ఇప్పటికే నిపుణులు మొత్తుకుంటున్నారు. అయినా ఎవరు పెద్దగా పట్టించుకోవటంలేదు. ఇపుడిప్పుడే విద్యార్ధుల్లోని మానసిక పరిస్ధితులపై అధ్యయనాలు కూడా మొదలయ్యాయి. ఇపుడు గనుక మేల్కొనకపోతే ముందు ముందు మరిన్ని దుష్ర్పభావాలు ఎదుర్కోక తప్పదు. అందుకనే ప్రభుత్వం ముందడుగు వేసి మొబైల్ ఫోన్లను నిషేధించింది. మరి ఆచరణలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: