తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం పాలిటిక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన తర్వాత బాగా హీట్‌గా మారాయి. ఈ హంద్రీనీవా నీటి వ్యవహారం టీడీపీ – వైసీపీలకు రాజకీయ ఆయుధంగా మారింది. కుప్పంకు నీళ్లు ఇచ్చిన క్రెడిట్ తమదేనంటున్న వైసీపీ, వైసీపీ ది కేవలం షోఅప్ అంటున్న టీడీపీ.. ఇలా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం అనేది ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారింది. తాజాగా కుప్పంలో పర్యటించిన ముఖ్యమంత్రి హంద్రీనీవా నీటిని కుప్పంకు అందించడంతో హంద్రీనీవా ఇష్యూ హాట్ టాపిక్ గా మారిపోయింది.కుప్పంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ కౌంటర్ అటాక్ ఇస్తోంది. కుప్పంకు హంద్రీనీవా క్రెడిట్ తమదేనంటున్న వైసీపీపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. కుప్పంకు హంద్రీనీవా జలాలు నేనే తెచ్చా అంటూ ప్రజలకు బూటకపు మాటలతో మోసం చేయవద్దని ముఖ్య మంత్రికి కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు.


తెలుగు దేశం పార్టీ ప్రభుత్వంలో వందల కిలోమీటర్లు కాలువ తవ్వి కుప్పంకు జల నిధిని అందించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో 30 కిలోమీటర్లు కూడా కాలువ తవ్వలేక పోయారని ఆరోపించారు తెలుగు దేశం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి.పోలవరం ప్రాజెక్టును విస్మరించి కుప్పంకు నీళ్లు తీసుకురావడం సాధ్యమా అని ప్రశ్నించిన అమర్నాధ్ రెడ్డి ఎన్నికలు దగ్గరవుతున్న వేళ మాటల గారడీ చెయ్యొద్దన్నారు.జగన్ మోహన్ రెడ్డి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కుప్పం అభివృద్ధి పేపర్ ప్రకటనకే పరిమితం అయ్యిందన్నారు. ముఖ్య మంత్రిగా చంద్రబాబు నాయుడు పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకున్నారని గుర్తు చేశారు. ఇరిగేషన్ శాఖపై అవగాహన లేక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారన్నా మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి.. వైఫల్యాలను జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఐదు సంవత్సరాల పాటు రివర్స్ గేర్ లో నడిచిన వైసీపీ సర్కార్ పర్యవసానంగా జగన్ కు రిటర్న్ గిఫ్ట్ కు కుప్పం ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: