ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్దీ టీడీపీ, వైసీపీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. తమ పార్టీకి అధికారం రాకపోతే ఏం జరుగుతుందనే భయం ఆ నేతల్లో ఉంది. కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, హిందూపురంలో బాలయ్యను ఓడించడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వైసీపీ వదులుకోవడం లేదు. ఈ నియోజకవర్గాలపై సీఎం జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో పాటు ఈ నియోజకవర్గాలలో పార్టీ కచ్చితంగా గెలవాలని కీలక నేతలకు ఆదేశాలు జారీ చేశారు.
 
మరోవైపు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలయ్యలకు ఈ ఎన్నికల్లో భారీ షాకులు తప్పవని వెల్లడించడం గమనార్హం. ప్రచారం జరుగుతున్న స్థాయిలో వాస్తవ పరిస్థితులు లేవని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెల్లడిస్తోంది. కుప్పంలో ఇంతకాలం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన కుటుంబాలు ఈసారి వైసీపీకి ఓటేస్తామని వైసీపీ పాలనలోనే సంక్షేమ పథకాలు అందాయని చెబుతున్నాయి.
 
పిఠాపురంలో వంగా గీత ప్రచారంలో దూసుకెళుతుండగా పవన్ కళ్యాణ్ మాత్రం గెలుపు కోసం వర్మపై ఆధారపడ్డారు. వర్మ పైకి మద్దతు ఇస్తున్నా తెర వెనుక వ్యవహారం మరోలా ఉందని పవన్ వర్మపై పూర్తిస్థాయిలో ఆధారపడితే భారీ షాక్ తప్పదని తెలుస్తోంది. మరోవైపు హిందూపురంలో కూడా పరిస్థితులు మారిపోయాయి. హిందూపురంలో పోటాపోటీ ఉండబోతుందని బాలయ్య ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో పాటు కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
 
బాలయ్య నియోజకవర్గ ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల హిందూపురం నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని భోగట్టా. చంద్రబాబు, పవన్, బాలయ్య ఇప్పటికైనా తమ నియోజకవర్గాలపై దృష్టి పెడితే ఎన్నికల నాటికి ఫలితాలు మారే ఛాన్స్ అయితే ఉంటుంది. విచిత్రం ఏంటంటే మంగళగిరిలో లోకేశ్ విజయం ఖాయమని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో వెల్లడైంది. లోకేశ్ మాత్రం 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే కావాలనే కలను నెరవేర్చుకోబోతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేయడం లోకేశ్ గెలుపునకు కారణమవుతోందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: