ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనలో పథకాల అమలు కంటే పథకాల ప్రచారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శలను నిజం చేస్తూ వైసీపీ వేస్తున్న తప్పటడుగులు న్యూట్రల్ ఓటర్లను పార్టీకి దూరం చేస్తున్నాయి. ఏపీలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అయితే కోడ్ ను సైతం పట్టించుకోకుండా విద్యుత్ శాఖ అధికారులు చేసిన పనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
అచ్యుతాపురంలోని చోడపల్లి జగనన్న కాలనీలలో రూల్స్ కు విరుద్ధంగా కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ మీటర్లపై సీఎం జగన్ ఫోటోతో ఉన్న నవరత్నాల లోగోను అతికించారు. అధికారులు స్వామిభక్తితో ఈ పనులు చేస్తున్నారో లేక వైసీపీ నేతల ఒత్తిడి వల్ల ఈ విధంగా చేస్తున్నారో తెలియాల్సి ఉంది. విద్యుత్ మీటర్లపై కూడా జగన్ బొమ్మను చూసి షాకవ్వడం లబ్ధిదారుల వంతవుతోంది. గతంలో కూడా వైసీపీ ప్రచారం పేరుతో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై విమర్శలు వచ్చాయి.
 
జగన్ మెప్పు పొందాలని కొందరు అధికారులు ఈ విధంగా చేసి ఉండవచ్చని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రూల్స్ ను సరిగ్గా పాటించాల్సిన అధికారులే తప్పులు చేస్తుంటే ఏం చేయాలో పాలు పోవడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. వైసీపీ ఎన్నికల కోడ్ నియమాలను పాటించడం లేదని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. రైతుల పాస్ పుస్తకాలు, రికార్డులపై జగన్ బొమ్మ ఉండటంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
ఎన్నికల కోడ్ ను ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మరో 38 రోజుల్లో ఎన్నికలు జరగనుండగా టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచి గెలుపు కోసం తమ వంతు కష్టపడుతున్నారు. హోరాహోరీ పోరు ఉన్న నియోజకవర్గాల్లో గెలుపు కోసం టీడీపీ, వైసీపీ ఎంతో కష్టపడుతున్నాయని ఈ సీట్లలో విజయం సాధిస్తే తమ పార్టీదే అధికారమని భావిస్తున్నాయి. సర్వేల ఫలితాలను పట్టించుకోకుండా ముందుకు సాగాలని చంద్రబాబు, జగన్ అభ్యర్థులకు సూచించినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: