ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పదవికి రాజీనామా చేయాలంటూ ఎక్స్ లో రిజైన్ జగన్ అనే హ్యాష్ ట్యాగ్ కొన్ని గంటల పాటు టాప్2 లో ట్రెండ్ అయింది. రిజైన్ జగన్ హ్యాష్ ట్యాగ్ పై ఏకంగా 3659 పోస్టులు వచ్చాయి. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా జగన్ పెన్షన్ల పంపిణీలో జరిగిన నిర్లక్ష్యంతో 32 మంది వృద్ధులు చనిపోయారంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
 
అయితే టీడీపీ నేతలు మాత్రం రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉందని జగన్ సీఎంగా ఉన్నారని పంచాయతీ అధికారులతో వృద్ధుల ఇంటికి వెళ్లి పెన్షన్ ఎందుకు ఇప్పించలేదని ప్రశ్నించారు. వైసీపీ శవ రాజకీయాలు చేస్తోందంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. రిజైన్ జగన్ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియా వేదికగా ట్రెండింగ్ కావడం ఇదే తొలిసారి కాదు. తిరుపతిలోని ఒక ఆస్పత్రిలో జరిగిన ఘటన వల్ల రెండేళ్ల క్రితం కూడా ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయింది.
 
ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం పింఛన్ల పంపిణీ అనే సామాజిక బాధ్యతను విస్మరించారని చెబుతూ పింఛన్ల కోసం లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులు తెలిసేలా నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తుండటం గమనార్హం. నెటిజన్లు అవ్వాతాతలకు మద్దతుగా వేల సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు. పింఛన్ల కోసం వచ్చిన వృద్ధుల ప్రాణాలు పోతుంటే వైసీపీ చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని నెటిజన్ల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.
 
ట్రెండింగ్ అవుతున్న ఈ హ్యాష్ ట్యాగ్ గురించి వైసీపీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. సీఎం జగన్ వృద్ధుల మరణాల పాపం చంద్రబాబుదే అని కామెంట్లు చేసిన నేపథ్యంలో టీడీపీ నుంచి ఈ విధంగా కౌంటర్ వచ్చిందని తెలుస్తోంది. ఏపీలో ఎన్నికలకు ఐదు వారాల సమయం మాత్రమే ఉండటంతో ఒకవైపు చంద్రబాబు మరోవైపు జగన్ సంచలన హామీలను ప్రకటిస్తున్నారు.మరింత సమాచారం తెలుసుకోండి: