ఆంధ్రాలో ఎన్నికలవేళ ఆయా పార్టీలలో వివిధ రకాల మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. జనసేన పార్టీ గురించి ఆదినుండి అందరికీ తెలిసినదే. 2019లో సింగల్ గా పోటీకి దిగి భంగపాటుకు గురైన ఈ పార్టీ ఈ సారి రెండు మూడు పార్టీలను కలుపుకొని కూటమిగా బరిలోకి దిగుతుంది. ఆ పార్టీలేమిటో ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ఈ క్రమంలో జనసేన నాయుకులలో కావచ్చు, ముఖ్యమైన కార్యకర్తలలో కావచ్చు.. ఒకింత అసహనం అనేది మొదలయ్యింది. ఇక ఇక్కడ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అది కాస్త ఎక్కువయిందనే చెప్పుకోవాలి. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేవలం 20 అంటే 20 సీట్లు మాత్రమే దక్కాయి. కారణం ఏదైనప్పటికీ ఈ సంఖ్య ఓ వైపు జనసైనికులకు, మరోవైపు ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలనబడే కొంతమందికి ఏమాత్రం నచ్చలేదు.

ఈ క్రమంలోనే కొంతమంది ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సిద్ధపడగా మరికొంతమంది అధికార పార్టీ వైస్సార్సీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు. అవును, ఎందుకంటే ఇక్కడ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారికి టిక్కెట్ అస్సలు దక్కలేదనేది వారి వాదన. ఇక్కడే వైసిపి వ్యూహం పన్నింది. అసంతృప్తితో ఉన్న వారిని వైసీపీ రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానిస్తున్నట్టు కనబడుతోంది. దీంతో జనసేనలో ఒక రకమైన గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. పొత్తు 3 పార్టీల మధ్య ఉండడంతో సీట్ల లెక్క అనేది మారింది. ఆశించిన నియోజకవర్గాల సంఖ్య మారింది. ఇది వారిలో అసంతృప్తికి కారణమైంది. మరోవైపు అగ్నికి ఆజ్యం పోసేలా వైసీపీ వ్యవహరిస్తుండడంతో.. జనసేన కీలక నేతలు మెల్లమెల్లగా పార్టీని విడుతున్నట్టు కనబడుతోంది.

ఈ నేపథ్యంలోనే పోతిన మహేష్ తాజాగా వైసీపీలో చేరడానికి డిసైడ్ అయినట్టు కనబడుతోంది. అదేవిధంగా ముమ్మిడివరం, అమలాపురం ఇన్చార్జులు అయినటువంటి పితాని బాలకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబు తదితరులు జనసేనకు రాజీనామా చేసేసారు. అక్కడితో ఆగకుండా వెంటనే జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డివి రావు కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఝలక్కిచ్చాడు. అయితే ఇలా రాజీనామా చేస్తున్న నేతలంతా గత ఎన్నికల్లో పోటీ చేసినవారే కావడం కొసమెరుపు. ఇలా ఒక్కొక్కరుగా జనసేన నేతలు వైసీపీలో చేరడాన్ని పవన్ కి మింగుడు పడడం లేదు. ఈ తరుణంలో పవన్ ప్రతి వ్యూహమేమిటో అని మిగిలిన నేతలు అంతా ఆకాశంవైపు చూస్తూ ఆలోచిస్తున్నట్టు కనబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: