ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీష్ రావు మెద‌క్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం పై ప్ర‌త్యే దృష్టిపెట్టారు. ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా అక్క‌డ గులాబీ జెండా ఎగ‌ర‌వేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థి వెంకట్రామి రెడ్డి కోసం విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. తాజాగా ఆయ‌న మెద‌క్ పార్ల‌మెంట్ స‌న్నాహ‌క స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..కేసీఆర్ కల్యాణ లక్ష్మి ఇచ్చారని, న్యూట్రిషన్ కిట్ ఇచ్చారు, రైతు బంధు, బీమా ఇలా అనేకం ఇచ్చారని వివ‌రించారు. కాంగ్రెస్ మాత్రం ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటినంక బోడ మల్లన్న అన్న చందంగా చేస్తుంద‌ని విమ‌ర్శించారు. బాండ్ పేపర్ మీద రాసిచ్చి మాట తప్పారని, ఆరు గ్యారెంటీలకు చరమ గీతం పాడారని అన్నారు. కల్యాణ లక్ష్మి ఇవ్వడం లేదని, ఇస్తామన్న తులం బంగారం ఎగబెట్టారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స్కూటీలు ఇస్తా అని మాట తప్పారని అన్నారు. హామీలు నెరవేర్చ‌నందుకు కాంగ్రెస్ పార్టీ మీద చీటింగ్ కేసు పెట్టాలని మండిప‌డ్డారు. బాకీ పడ్డ హామీలు అమలు చేశాకే ప్రజల మధ్యకు రావాలని స్ప‌ష్టం చేశారు. నిరుద్యోగ భృతి విషయానికి వస్తే అది కూడా మాట తప్పారని వివ‌రించారు. కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్ బంద్ అయ్యిందని తెలిపారు. కరెంట్ కోతలు స్టార్ట్ అయ్యాయని, చెయ్యారాకనా..? రైతుల మీద కక్షనా..? అంటూ ప్ర‌శ్నించారు. రఘునందన్ రేవంత్ రెడ్డిలాగే మాటలు చెప్పాడు, చేతలు లేవని ఎద్దేవా చేశారు. మోసం చేసిన ఆయన్ను దుబ్బాక ప్రజలు మడత పెట్టి ఉతికారని అన్నారు. కలెక్టర్ గా వెంక‌ట్రామిరెడ్డి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశార‌ని వివ‌రించారు. ఎంపీగా తప్పకుండా సేవా కార్యక్రమాలు చేస్తాడ‌ని, అటెండేర్ ఆరోగ్యం కోసం తిరుపతికి మొక్కి తలనీలాలు సమర్పించిన వ్యక్తి అని పొగ‌డ్త‌లు కురింపించారు. మెదక్ బీ‌ఆర్‌ఎస్‌కు కంచుకోట అని ఎవరూ అధైర్య పడద్దని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: