ఊసరవెల్లి తాను ఉన్న పరిస్థితికి తగ్గట్టుగా ఏ విధంగా రంగులు మారుస్తుందో  ప్రస్తుత కాలంలో రాజకీయ నాయకులు కూడా  వారి అవసరాలకు తగ్గట్టుగా పార్టీలు మారుతున్నారు.  కొంతమంది ఎన్నికల్లో పోటీ చేసే ముందు పార్టీలు మారితే మరి కొంతమంది పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలిచి పార్టీలు చేంజ్ అవుతున్నారు. నాయకులు పార్టీల మార్పు అనేది రాజకీయం పుట్టినప్పటినుంచి ఉందని చెప్పవచ్చు. ఇదంతా ఒకేత్తు అయితే ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ రాజకీయం మరో విధంగా ఉంది. మొన్నటి వరకు బిఎస్పీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగి, బహుజన వాదం అనే నినాదంతో  బీసీ, ఎస్సీ, ఎస్టీలు అంతా ఏకం అవ్వాలని  పిలుపునిచ్చారు. మన రాజ్యాధికారాన్ని మనమే తెచ్చుకోవాలని ప్రజలను ఎంతో మోటివేట్ చేశారు.
 
ఆయనను నమ్మి  ఎంతోమంది బహుజనులు బీఎస్పీ వెంట నడిచారు. చదువుకున్న వ్యక్తి కదా  సమాజాన్ని అభివృద్ధి చేస్తాడని భావించారు.  కానీ అనూహ్యంగా  ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్  బీఎస్పీ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎంతో నమ్ముకున్న నాయకులకు  పంగనామాలు పెట్టడని చెప్పవచ్చు. ఇతర నాయకులకే కాదు తన సొంత తమ్ముడిని కూడా  ఆయన పార్టీ అవసరాలకు వాడుకొని నట్టేట ముంచినట్టు తెలుస్తోంది. ప్రవీణ్ కుమార్ సోదరుడు పశుసంవర్ధక శాఖలో ప్రొఫెసర్ గా పనిచేసేవారు. ఆయన పేరు ప్రసన్నకుమార్. తన అన్న బీఎస్పీ పార్టీని లీడ్ చేస్తున్నారని  ఎలాగైనా తన లక్ష్య సాధనలో భాగం అవ్వాలని ఆయన తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి మరీ అన్నకు సపోర్ట్ గా నిలిచారు. అంతేకాకుండా  తన సొంత నియోజకవర్గమైన అలంపూర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

ఎలాగైనా బహుజన వాదాన్ని తీసుకురావాలని అన్న వెంట కంకణం కట్టుకొని మరీ నడిచారు. చివరికి అన్న మోసం చేశాడని తెలిసి దుమ్మెత్తి పోస్తున్నాడట. తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఆయన బీఆర్ఎస్ లో చేరారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారట. తన అన్న చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆయన కూడా అన్నకు చెక్ పెట్టే విధంగా  కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ లో ఆయన చేరితే మాత్రం  తప్పక నాగర్ కర్నూల్ లో  ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కు వ్యతిరేకంగా పనిచేస్తాడనే వార్తలు జోరందుకుంటున్నాయి. మరి చూడాలి ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుంది.. ప్రవీణ్ కుమార్ కు తమ్ముడి నుండి ఎలాంటి డ్యామేజ్ ఎదురవుతుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: