తెలంగాణ ఎంపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులను ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఖరారు చేశాయి. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను ఎంపిక చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డిని ప్రకటించింది. బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో నిలుస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, ఆరు గ్యారెంటీలతో ప్రజల ఆదరణ పొందుతున్న అధికార పార్టీ కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలుపొంది, మరోసారి సత్తా చాటాలని జోరుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రచారాలు కొనసాగిస్తుంది. రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో మెజార్టీ ఓట్లు గెలుస్తుందని నమ్ముతోంది. ఇటు బీజేపీ అయోధ్య రామ మందిరం, కేంద్ర, ప్రభుత్వ సంక్షేమ పథకాలను నమ్ముకుంది. ఈసారి కూడా ప్రధానిగా నరేంద్ర మోడీయే గెలుస్తారని భావిస్తుంది. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్ లలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉండడంతో విజయం సాధిస్తుందని బీజేపీ అధిష్టానం అంచనాలు వేస్తోంది. విజయం సాధించడం కోసం ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేసిన వెంటనే బీజేపీ ప్రచారాలు మొదలుపెట్టింది. మరోసారి నిజామాబాద్ స్థానంలో కషాయ జెండా ఎగురుతుందని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది.ఇకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా ఓటమిపాలైన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని కసితో ఉంది. దీంతో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గెలిచిన మూడు అసెంబ్లీ సెగ్మెంట్ లతో పాటు మిగతా నాలుగు సెగ్మెంట్ లలో కూడా విజయం సాధించాలని ప్రత్యేక దృష్టి సారించింది. అయితే ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారు కావడం విశేషం. ఈ మూడు ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్న ఈ పోటీల్లో గెలుపు ఎవరిదో చూడాలని నియోజకవర్గ ప్రజలు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈసారి ఎంపీ సీటు ఏ పార్టీ అభ్యర్థిని వారిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: