రానున్న తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైన బీఆర్ఎస్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులేస్తుంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది.  
ఈ క్రమంలో వరంగల్ లోక్ సభ అభ్యర్థి ఎంపిక విషయంలో కేసిఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీని అంటి పెట్టుకొని ఉన్న నేతలకే ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే  ఈ సమయంలోనే బరిలో ఉన్న ప్రధాన దళిత నేతలందరూ పార్టీకి గుడ్ బై చెప్పడం జరిగింది. ఈ క్రమంలో మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్  ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుతారని ప్రచారం కూడా జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఆశించి  భంగపడిన రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ కేసీఆర్ పిలిస్తే పార్టీలో చేరి, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని రాజయ్య అన్నారు. కానీ ఇప్పటివరకు ఆయనకు ఎలాంటి పిలుపు వెళ్లలేదు.   రాజయ్యపై అధిష్టానానికి నమ్మకం లేకపోవడమే దీనికి కారణమని పార్టీ వర్గాల సమాచారం. చిన్న చిన్న కారణాలతో పార్టీకి రాజీనామా చేసిన రాజయ్యను నమ్మలేమని గులాబీ బాస్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.
ఇకపోతే, వరంగల్ ఎంపీ అభ్యర్థి విషయంపై పార్టీలోని సీనియర్లతో పాటు ముఖ్య నేతలతో బీఆర్ఎస్ బాస్ చర్చలు జరుపుతున్నారు. ఉద్యమ నేత పరంజ్యోతి, హనుమకొండ జడ్పీ చైర్ పర్సన్ సుధీర్ కుమార్ లలో ఎవరో ఒకరిని ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం. కానీ కడియం కావ్యకు రాజయ్యే సరైన పోటీ ఇవ్వగలరని మరికొందరు నేతలు చెబుతున్నారు. ఈ విషయంపై మరో రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: