ఆంధ్రప్రదేశ్  రాజీకాయాలలో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి.. పలు నియోజకవర్గాలలో అధికార, ప్రతి పక్ష పార్టీ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో పొలిటికల్‌ ఫైట్‌ తారాస్థాయికి చేరింది.. ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ మరియు టీడీపీ శ్రేణులు పరస్పరం దాడికి దిగుటుండటంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి..ఇరుపార్టీల ప్రధాన నేతలు అయిన మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరియు టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ రంగంలోకి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందినవారికి తీవ్ర గాయాలయ్యాయి.. 

ఒంగోలులోని సమత నగర్ లో ప్రారంభమైన ఈ గొడవ ఒంగోలు రిమ్స్‌ వరకు చేరింది..సమత నగర్‌ లో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస రెడ్డి కోడలు కావ్య రెడ్డి ప్రచారం  నిర్వహించారు. అయితే ఆమె ప్రచారాన్ని ఓ అపార్ట్ మెంట్ లోని మహిళలు అడ్డుకున్నారు. అపార్ట్ మెంట్ వద్ద మహిళలకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకోవడంతో ఇరు పార్టీల శ్రేణులు గొడవకు దిగారు..ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. 

ఈ ఘటనలో టీడీపీ మరియు వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.. టీడీపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డ వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేయాలంటూ ఎస్పీ కార్యాలయం వద్దకు ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులరెడ్డి మరియు అసెంబ్లీ అభ్యర్ధి దామచర్ల జనార్దన్ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.మరోవైపు ఘటన స్థలానికి వెళ్లిన మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తమ కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించటంతోనే ఘటన జరిగిందని ఆయన మండిపడ్డారు. పరస్పర దాడులతో గాయలపాలైన టీడీపీ, వైసీపీ కార్యకర్తలను చూడటానికి ఇరు పార్టీ నేతలు బాలినేని, దామచర్ల ఒకేసారి చేరుకున్నారు.. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకేసారి చేరుకోవడంతో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది.. చివరికి ఇరు నేతలను అక్కడ నుంచి పంపించడంతో గొడవ ఆగిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: