కొంద‌రు నాయ‌కులు గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌ణ‌లు వ‌స్తుంటాయి. అయితే.. వీటిలో కొన్ని మాత్ర‌మే నిజం అవుతాయి. మ‌రికొన్ని మాత్రం గ్యాసిప్‌లుగానే మిగిలిపోతాయి. కానీ, ఒక‌రిద్ద‌రి నాయ‌కుల విష‌యం చూస్తే మాత్రం లెక్క‌లు కూడా ప‌క్కాగా వారు విజ‌యం ద‌క్కించుకుంటాయ‌న చెబుతాయి. ఇలాంటి వారిలో మ‌చిలీప‌ట్నం నుంచి పార్ల‌మెంటు అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన జ‌న‌సేన నాయ‌కుడు వ‌ల్ల‌భ నేని బాల‌శౌరి ఒక‌రు. ఈయ‌న గెలుపు ప‌క్కా అనేది కేవ‌లం మాట మాత్ర‌మే కాదు.. ప‌క్కా లెక్క కూడా.


మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంటు ప‌రిధిలో ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. గ‌న్న‌వ‌రం, గుడివాడ‌, పెన‌మ‌లూరు, పెడ‌న‌, పామ‌ర్రు, మ‌చిలీప‌ట్నం, అవ‌నిగ‌డ్డ ఉన్నాయి. వీటిలో ఉన్న ప‌రిస్థితులు.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల జాత‌కాలు, ఆయా అభ్య‌ర్థులు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీల ప‌రిస్థితిని అంచ‌నా వేసుకుంటే.. మ‌చిలీప‌ట్నం అభ్య‌ర్థిగా ఉన్న బాల‌శౌరి ఏం రేంజ్‌లో విజ‌యం ద‌క్కిం చుకుంటార‌నేది తెలిసిపోతుంది.


నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిస్థితి ఇదీ..
గ‌న్న‌వ‌రం:  టీడీపీ త‌ర‌ఫున యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు, వైసీపీ త‌ర‌ఫున వ‌ల్ల‌భ‌నేని వంశీలు పోటీ చేస్తున్నారు. ప్ర‌స్తుతం యార్ల‌గ‌డ్డ వైపే జ‌నాలు ఉన్నారు. వంశీ త‌న ఇమేజ్‌ను పోగొట్టుకోవ‌డం.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న సైకిల్ గుర్తుపైనే పోటీ చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ రెండు ఇప్పుడు ఆయ‌న‌కు లేవు. దీంతో యార్ల‌గ‌డ్డ గెలుపు ఖాయం.


గుడివాడ‌:  టీడీపీ నుంచి వెనిగండ్ల రాము, వైసీపీ నుంచి మాజీ మంత్రి కొడాలి నాని బ‌రిలో ఉన్నారు. ఇక్క‌డ ట‌ఫ్ ఫైట్ ఉంద‌ని చెబుతున్నారు. నాలుగుసార్లు గెలిచిన నానిపై విర‌క్తి క‌లిగితే.. టీడీపీ విజ‌యం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఏదేమైనా గుడివాడ‌లో ఈ సారి న‌రాలు తెగే ఉత్కంఠ పోరు ఖాయం.
పెన‌మ‌లూరు:  ఇక్క‌డ నాన్‌లోక‌ల్ అయిన వైసీపీ నేత జోగి ర‌మేష్‌కు క‌లిసివ‌స్తున్న‌వారు ఎవ‌రూ లేరు. పైగా.. గ‌త ఐదేళ్ల‌లో ఓడిపోయినా ప్ర‌జ‌ల కోసం ఉన్న‌.. బోడే ప్ర‌సాద్‌వైపే జ‌నాలు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇక్క‌డ టీడీపీ గెలుపు ఏక‌ప‌క్ష‌మ‌నే వాద‌న వినిపిస్తోంది.


పెడ‌న‌:  ఇక్క‌డ కూడా టీడీపీ విజ‌యం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో కాగిత కృష్ణ ప్ర‌సాద్ ఓడిపోయారు. ఇది ఆయ‌న‌కు సానుభూతిని పెంచింది. దీంతో టీడీపీ గెలుపు ప‌క్కా అని రాసిపెట్టుకున్నా రు. మ‌రోవైపు.. వైసీపీ త‌ర‌ఫున ఉప్పాల రాంప్ర‌సాద్‌కు పెద్ద‌గా ప్ర‌జ‌లు జై కొట్ట‌డం లేదు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనూ కూట‌మి గెలుపు ఖాయ‌మ‌ని అంటున్నారు.


పామ‌ర్రు:  ఇక్క‌డ ట‌ఫ్ ఫైట్ ఉంది. వైసీపీ త‌ర‌ఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ బ‌రిలో ఉన్నారు. మ‌రోవైపు టీడీపీ నుంచి వ‌ర్ల కుమార్ రాజా ఉన్నారు. అయితే.. ఐదేళ్లుగా కుమార్ రాజా బాగానే ప‌నిచేస్తున్నాడ‌నే పేరు తెచ్చుకున్నారు. దీంతో ఇక్క‌డ గెలిచినా ఆశ్చ‌ర్యం లేదు. అయితే ఫైట్ మాత్రం ట‌ఫ్‌గానే ఉంటుంద‌ని చెబుతున్నారు.


మ‌చిలీప‌ట్నం:  ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేత‌, మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర గెలుపు త‌థ్య‌మ‌ని చెబుతున్నారు. ఐదేళ్ల‌లో ఆయ‌న ఎదుర్కొన్న కేసులు.. చేస‌ని ఉద్య‌మాలు వంటివి గెలిపిస్తాయ‌ని చెబుతున్నారు. ఇక‌, వైసీపీ త‌ర‌ఫున యువ నేత పేర్ని కిట్టు పోటీ చేసినా.. కేవ‌లం డిపాజిట్ మాత్రంద‌క్కుతుంద‌ని చెబుతున్నారు.


అవ‌నిగ‌డ్డ‌:  బ‌ల‌మైన నేత మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్‌కు జ‌న‌సేన టికెట్ ఇచ్చింది. దీంతో ఆయ‌న త‌న వ‌ర్గం వారిని మ‌లుపు తిప్పే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఫ‌లితంగా ఇక్క‌డ కూడా గెలుపు గుర్రం కూట‌మిదేన‌ని చెబుతున్నారు. సో.. మొత్తంగా చూసుకుంటే.. ఈ ఏడు చోట్ల 4 సీట్లు ఇప్ప‌టికే గెలిచే స్థానాలుగా ఉన్నాయి. ఫ‌లితంగా ఇది మ‌చిలీప‌ట్నం ఎంపీ అభ్య‌ర్థి విజ‌యాన్ని సునాయాసం చేస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: