గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ ఇక్క‌డ ఏటికి ఎదురీదుతున్నారు. ఆమె ఏ ముహూర్తంలో చిల‌క‌లూరిపేట వ‌దిలి.. వెస్ట్‌లోకి అడుగు పెట్టారో ఏమో. ఇక్క‌డ క‌లిసి వ‌స్తున్న ప‌రిణామాలు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పైగా.. ఆమెను వ్య‌తిరేకిస్తున్న రెండు వ‌ర్గాలు యాంటీ ప్ర‌చారం చేస్తున్నాయి. పైకి మాత్రం న‌వ్వుతూనే ఉన్నా.. లోలోన ర‌గిలిపోతున్న వైసీపీ నాయ‌కులు.. క్షేత్ర‌స్థాయిలో సోష‌ల్ మీడియా ద్వారా యాంటీ ప్ర‌చారాన్ని తీవ్రం చేశారు.


ఇక‌, ప్ర‌చారానికి వెళ్దాం వ‌స్తారా? అంటే.. వ‌స్తామ‌ని చెబుతున్న నాయ‌కులు కూడా.. చివ‌ర‌కు హ్యాండిస్తు న్నారు. స్తానిక ప్ర‌జ‌లు కూడా విడ‌ద‌ల ర‌జ‌నీని ప‌ట్టించుకోవ‌డం లేదు. ముఖ్యంగా గుంటూరు వెస్ట్‌పై అంతో ఇంతో ప‌ట్టున్న లేళ్ల అప్పిరెడ్డి వ‌ర్గం.. దోబూచులాడుతోంది. ఎక్క‌డా ఆమెకు స‌హ‌కారం అందించ డం లేదు. దీనిని పైకి చెప్పుకోలేక‌, మ‌న‌సులోనే దాచుకోలేక ర‌జ‌నీ స‌త‌మ‌తం అవుతున్నారు. ఇక‌, ఈ ప్ర‌య‌త్నాలు బెడిసి కొడుతుండ‌డంతో చిల‌క‌లూరిపేట నుంచి త‌న వారిని తెచ్చుకుని ప్ర‌చారం చేస్తున్నారు.


ఇప్ప‌టికే ర‌జ‌నీ హ‌వా పార్టీలో ఓ రేంజ్‌లో న‌డుస్తోంది. రేపు ఆమె ఇక్క‌డ గెలిస్తే న‌గ‌రంపై వైసీపీ నాయ‌కుల ప‌ట్టు పోతోంద‌న్న బాధ వారిలో ఎక్కువుగా ఉంది. ర‌జ‌నీ కూడా స్థానిక కేడ‌ర్‌పై పెద్ద‌గా న‌మ్మ‌కం పెట్టుకున్న‌ట్టు లేదు. ఇక్క‌డే బ‌స కూడా ఏర్పాటు చేసి పేట  నాయ‌కుల‌ను రంగంలోకి దింపారు. అయితే.. వీరిపై నియోజ‌క‌వ‌ర్గంలో స‌ద‌భిప్రాయం లేక పోవ‌డంతో ఎవ‌రిని క‌లిస‌నా.. ముఖం చాటేస్తున్నారు.అంతేకాదు.. ర‌జ‌నీ ఎవ‌రు? అని ప్ర‌శ్నిస్తున్న ప‌రిస్థితి కూడా క‌నిపిస్తోంది. దీంతో క్షేత్ర‌స్థాయిలో ర‌జ‌నీ ప‌రిస్థితి దారుణం గా ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది.


పైకి చాలా గంభీరంగా త‌నే గెలుస్తాన‌ని ప‌దే ప‌దే చెబుతున్నా.. లోలోన మాత్రం అనేక స‌మ‌స్య‌లు ర‌జ‌నీని వెంటాడుతున్నాయి. ఏ పార్టీ అయినా.. నాయ‌కుడు అయినా.. క్షేత్ర‌స్థాయిలో కేడ‌ర్ స‌హ‌కారం లేక‌పోతే.. క‌ష్ట‌మ‌నే భావ‌న ఉంటుంది. ఇదే ఇప్పుడు ర‌జనీకి ప్ర‌ధానంగా ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌. మ‌రోవైపు ఆత్మీయ స‌మావేశాల పేరుతో ఖ‌ర్చు పెట్టి కుల సంఘాల‌ను ఏకం చేయాల‌ని చూస్తున్నా.. అవి కూడా పెద్ద‌గా వ‌ర్కవుట్ కావ‌డం లేదు. మైనారిటీ సామాజిక వ‌ర్గం దూరంగా ఉంది.


చిల‌క‌లూరిపేట‌లో ఆమె భ‌ర్త కాపు కావ‌డం, ఇటు తాను బీసీ కావ‌డంతో ఆ ఈక్వేష‌న్ గ‌ట్టిగా వాడుకున్నారు. ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తోన్న పిడుగురాళ్ల మాధ‌వి కూడా బీసీ కావ‌డం.. ఆమె భ‌ర్త మ‌రో ప్ర‌ముఖ సామాజిక వ‌ర్గం కావడంతో ర‌జ‌నీ ఈక్వేష‌న్ వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. దీనికి తోడు న‌గ‌రంలో ప‌ట్ట‌ణ ఓట‌ర్లు మెజార్టీ వైసీపీ ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక భావంతో ఉన్నారు. ఇక రాజ‌ధాని మార్పు ప్ర‌భావంతో మ‌ధ్య త‌ర‌గ‌తి, ఎగువ మ‌ధ్య త‌ర‌గ‌తి, ఇత‌ర ఉన్న‌త వ‌ర్గాల వారు కూడా వైసీపీని ఓడించాల‌ని క‌సితో ఉన్నారు.


ఇలాంటి కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ ర‌జ‌నీకి క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు దూరంగా ఉండ‌డం, కేడ‌ర్ కూడా స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం.. గెలుపుపై ప్ర‌భావం చూపిస్తుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: