- పుంగనూరు, తంబ‌ళ్ల‌ప‌ల్లి అసెంబ్లీతో పాటు రాజంపేట పార్ల‌మెంటు ఈ ఫ్యామిలీకే
- సీమ టిక్కెట్ల‌న్నీ పెద్దిరెడ్డి కంట్రోల్లోనే.. గోదావ‌రి బాధ్య‌త‌లు మిథున్‌రెడ్డికి
- వైసీపీలో స‌గం ప్ర‌భుత్వం పెద్దిరెడ్డి ఫ్యామిలీదే..!

( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్. జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం నడుస్తోంది. అయితే రాయలసీమతో పాటు ఇటు గోదావరి జిల్లాలలోనూ చాలా చోట్ల వైసీపీ సీనియర్ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వం అనధికారికంగా నడుస్తుందని చెప్పాలి. రాయలసీమ వ్యవహారాలు మొత్తం ఇప్పుడు పెద్దిరెడ్డి కంట్రోల్ చేస్తున్నారు. అక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థులు.. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికతో మొదలుపెట్టి వారికి ఆర్థిక వనరులు సమకూర్చటం ఇలాంటి వ్యవహారాలు అన్ని పెద్దిరెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే నడుస్తున్నాయి. ఇటు ఉభయగోదావరి జిల్లాల పార్టీ ఇన్చార్జిగా ఉన్న పెద్దిరెడ్డి తనయుడు ఎంపీ మిథున్ రెడ్డి కూడా గోదావరి జిల్లాల వైసీపీ రాజకీయాన్ని తాను కంట్రోల్ చేస్తూ శాసిస్తూ వస్తున్నారు.


ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ, హంగామా.. హడావుడి మామూలుగా లేదని చెప్పాలి. ఇక ప్రభుత్వంలోను పెద్దిరెడ్డి ఫ్యామిలీకి జగన్ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే పెద్దిరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టారు. మధ్యలో కొందరు కీలక నేతల మంత్రి పదవులు పీకేసినా కూడా పెద్దిరెడ్డి మాత్రం జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు మంత్రిగా కంటిన్యూ అయ్యారు. ఇక పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డి రాజంపేట నుంచి ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచారు. తాజా ఎన్నికల్లో పెద్దిరెడ్డి తన కంచుకోటూ పుంగ‌నూరు నుంచి మరోసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఇక మిథున్ రెడ్డి రాజంపేట నుంచి వరుసగా మూడోసారి పార్లమెంటుకు పోటీపడుతున్నారు.


ఇక 2019 ఎన్నికలకు ముందు తంబళ్లప‌ల్లిలో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ఎవరు లేకపోవడంతో అనూహ్యంగా పెద్ద రెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డికి చివరి క్షణంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. జగన్ ప్రభంజనంలో తంబళ్లపల్లెలో ద్వారకానాథ్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి ఆయన అక్కడ నుంచే పోటీ చేస్తున్నారు. అలా పెద్దిరెడ్డి ఫ్యామిలీకి కూడా జగన్ అదిరిపోయే ప్యాకేజీ ఇచ్చారు. ఈ కుటుంబానికి రెండు ఎమ్మెల్యే సీట్లతో పాటు కీలకమైన రాజంపేట పార్లమెంటు స్థానాన్ని కట్టబెట్టారు. దీనికి తోడు అటు రాయలసీమ వ్యవహారాలు అన్ని పెద్దిరెడ్డికి.. ఇటు ఉభయగోదావరి జిల్లాల వ్యవహారాలు అన్ని మిథున్‌రెడ్డికి కట్టబెట్టేశారు.


దీంతోపాటు మిథున్ రెడ్డి - పెద్దిరెడ్డి కలిసి దాదాపు ఒక 40 నుంచి 50 ఎమ్మెల్యే టికెట్లతో పాటు, ఐదు ఆరు పార్లమెంటు స్థానాల సీట్లు కూడా నిర్ణయించారనే చెప్పాలి. అలా జగన్ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ హ‌వా ఒక రేంజ్ లో కొనసాగుతోంది. ఇక తాజా ఎన్నికల్లోను పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తున్న ముగ్గురూ గెలుస్తారా అంటే ఇప్పటివరకు అయితే ఎలాంటి సందేహాలు లేవు. అందులోనూ పుంగనూరులో పెద్దిరెడ్డికి ... రాజంపేట పార్లమెంటు నుంచి మిథున్ రెడ్డికి పెద్దగా పోటీ లేకుండానే విజయం దక్కవచ్చు. తంబళ్లపల్లెలో ద్వారకానాథ్ రెడ్డి గట్టి పోటీ మధ్యలో కూడా విజయం సాధిస్తారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: