- మేన‌ళ్లుడు మ‌జ్జి శ్రీను దెబ్బ‌తో బొత్స‌కు గెలుపు సంక్లిష్టం..?
- సీనియ‌ర్ నేత క‌ళా ఎంట్రీతో పుంజుకున్న టీడీపీ..?
- బొత్స కంచుకోట‌ను మ‌ర‌ద‌లు మృణాళినిలా క‌ళా బ‌ద్ద‌లు కొడ‌తారా ?

( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ )
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం ఏపీలో ఉన్న‌ వీఐపీ నియోజకవర్గాల్లో ఒకటి. అక్కడ నుంచి వైసీపీ త‌ర‌పున ప్ర‌స్తుత మంత్రి బొత్స సత్యనారాయణ పోటీలో ఉన్నారు. మామూలుగా బొత్స‌కు చీపురుప‌ల్లి కంచుకోటే అని చెప్పాలి. ఇక్క‌డ నుంచి 2004, 2009 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా గెలిచి మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన బొత్స‌.. 2014 ఎన్నిక‌ల్లో ఓడినా త‌ర్వాత 2019 ఎన్నిక‌ల నాటికి పుంజుకుని ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఐదేళ్ల పాటు కంటిన్యూగా మంత్రిగా ఉన్నారు.


ఇక చీపురుప‌ల్లిలో బొత్స‌కు పోటీగా టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు పోటీ చేస్తున్నారు. బొత్స మ‌రీ గ‌ట్టి యోధాను యోధుడు అయిన రాజకీయ నేత ఏమీ కాదు. ఆయన మెజార్టీ ఎప్పుడూ భారీగా లేదు. ఎప్పుడూ ఏటికి ఎదురీదుతూనే గెలుస్తూ వ‌స్తూ ఉంటారు. ఆయ‌న 1999లో బొబ్బిలి ఎంపీగా గెలిచిన‌ప్ప‌టి నుంచి గ‌త ఎన్నిక‌ల్లో గెలుపు వ‌ర‌కు చూస్తే గ‌ట్టి పోటీ మ‌ధ్య‌లోనే ఆయ‌న గెలుస్తుంటారు. బొత్స‌కు చీపురుప‌ల్లిలో ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు చేసే ఎలక్షనీరింగ్ చాలా ప్లస్ అవుతుంటుంది.. అయితే ఇదే ఆయ‌న‌కు ఈ సారి మాత్రం మైన‌స్ అవుతోందంటున్నారు.


మ‌జ్జి శ్రీను అలియాస్ చిన్న శ్రీను తీరు న‌చ్చ‌క చాలా మంది పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం 2.03 ల‌క్ష‌ల ఓట‌ర్ల‌లో స‌గం పురుషులు.. స‌గం మ‌హిళ‌లు ఉన్నారు. నియోజకవర్గంలో చీపురుపల్లి, గరివిడి, గుర్ల, మెరకముడిదాం మండలాలలో 120 గ్రామ పంచాయితీలుంటే 150 రెవెన్యూ గ్రామాలు... 257 పోలింగ్‌ బూత్‌లున్నాయి. టీడీపీ - వైసీపీ మ‌ధ్య హోరాహోరీ పోరు అయితే న‌డుస్తోంది.


ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ టీడీపీ ఇన్‌చార్జ్‌గా మాజీ మంత్రి కిమిడి మృణాళిని కొడుకు నాగార్జున ఉన్నారు. ఇప్పుడు త‌న‌ను త‌ప్పించి త‌న పెద‌నాన్న క‌ళా వెంకట్రావుకు సీటు ఇవ్వ‌డంతో నాగార్జున కొంత అసంతృప్తితోనే ఉన్నారు. బొత్స వంటి బ‌ల‌మైన‌ నేతను ఢీకొట్టేలా నాగార్జున బలపడలేకపోయారనే క‌ళా వెంక‌ట్రావును దించారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీకి స‌పోర్ట్ చేసిన త్రిమూర్తుల రాజు, గద్దె బాబూరావు ఇటీవ‌ల టీడీపీలో చేరారు. కళా వెంకట్రావుకు మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు టీడీపీలోకి పెద్ద ఎత్తున వ‌ల‌స‌లు మొద‌ల‌య్యాయి.


దివంగత ఎమ్మెల్యే కోట్ల సన్యాసప్పలనాయుడు కుటుంబం మొత్తం టీడీపీలో చేర‌డం ప్ల‌స్ అయ్యింది. గరివిడి మండలంతో పాటు మేజర్ పంచాయతీ అయిన సోమలింగాపురం వైసీపీ నేతలంతా టీడీపీలోకి క్యూ క‌డుతున్నారు. బొత్స‌కు ఏక‌ప‌క్షంగా ఓట్లేసే గ్రామాల్లో ఇప్పుడు రెండు పార్టీలు స‌మానం అయిపోతున్నాయి. ఇక పేరుకు మాత్ర‌మే ఇక్క‌డ వైసీపీ నుంచి బొత్స పోటీ చేస్తున్నా ఆయ‌న భార్య ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీలో ఉండ‌డంతో ఇక్క‌డ వ్య‌వ‌హారాలు అంతా చిన్న శ్రీనే చూస్తుండ‌డం కూడా వైసీపీలో చాలా మందికి న‌చ్చ‌డం లేదు.


ఇక బొత్స కూడా రాజ్య‌స‌భ‌కు వెళ్లి ఈ సీటు చిన్న శ్రీనుకే ఇప్పించాల‌నుకున్నా జ‌గ‌న్ ఒప్పుకోలేదు. బొత్స‌నే పోటీ చేయాల‌ని చెప్ప‌డంతో ఆయ‌న అయిష్టంగానే పోటీ చేస్తున్నారు. అయితే ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌, చిన్న శీను య‌వ్వారాలు.. ఇవ‌న్నీ పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. అటు క‌ళా వెంక‌ట్రావు సీనియ‌ర్ నేత కావ‌డంతో టీడీపీలో గ్రూపులు, అసంతృప్తులు ఉన్నా అంద‌రూ క‌లిసి క‌ట్టుగా ఫైట్ చేస్తున్నారు. ఏదేమైనా చీపురుప‌ల్లిలో బొత్స‌కు వ‌న్ సైడ్‌గా అయితే లేద‌నే తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: