- క‌మ్మ కోట‌లో గెలుపుకోసం 20 ఏళ్లుగా టీడీపీ ఆపసోపాలు..!
- క‌నిగిరి నుంచి కందుకూరుకు వ‌ల‌సొచ్చిన వైసీపీ బుర్రా
- టీడీపీ నుంచి ఇంటూరి నాగేశ్వ‌ర‌రావు పోటీ... రాజేష్ ఇండిపెండెంట్ అయితే టీడీపీ క‌ష్ట‌మే..!

( ప్ర‌కాశం - ఇండియా హెరాల్డ్ )
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా గుర్తింపు తెచ్చుకున్న కందుకూరు నియోజకవర్గంలో... కేవలం రెండు సార్లు మాత్రమే టీడీపీ విజయం సాధించింది. 1994, 1999 ఎన్నికల్లో మాత్రమే టీడీపీ అభ్యర్థి దివి శివరాం గెలిచారు. అంతకు ముందు, ఆ తర్వాత కూడా కందుకూరు అంటే కేరాఫ్‌ మానుగుంట మహిధర్ రెడ్డి అనే పేరు స్థిరపడిపోయింది. 1985లో తొలిసారి గెలిచిన మహిధర్ రెడ్డి... తర్వాత 2004, 2009, 2019 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.


2014లో కూడా వైసీపీ తరఫున పోటీ చేసిన గెలిచిన పోతుల రామారావు.. ఆ తర్వాత టీడీపీలో చేరారు. వరుసగా మూడుసార్లు ఓడిన దివి శివరాం... 2019 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2019లో టీడీపీ తరఫున పోతుల రామారావు పోటీ చేసి ఓడారు. ఇక ప్రస్తుత ఎన్నికల్లో రెండు పార్టీల తరఫున కూడా నియోజకవర్గంలో కొత్త వ్యక్తులే పోటీ చేస్తున్నారు. టీడీపీ తరఫున ఇంటూరి నాగేశ్వర్రావు తొలిసారి ప్రజాక్షేత్రంలో తలపడుతుండగా... వైసీపీ తరఫున కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు.


వాస్తవానికి కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల ఆధిపత్యం చెలాయిస్తున్న కందుకూరు నియోజకవర్గంలో తొలిసారి బీసీ అభ్యర్థిని బరిలోకి దింపింది వైసీపీ. బీసీ సామాజిక వర్గాల ఓటర్లే లక్ష్యంగా వైసీపీ అధినేత ప్లాన్‌ చేస్తున్నారు. అయితే ఇక్కడ వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగలటం ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది. సౌమ్యుడు అనే పేరున్న మానుగుంట మహిధర్‌ రెడ్డిని తప్పించటం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో అటు గ్రామీణ ప్రాంతాలతో పాటు కందూకురు పట్టణంలో కూడా మహిధర్ రెడ్డికి గట్టి పట్టుంది. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారనే పేరు కూడా ఉంది.


జిల్లాలో మహిధర్‌రెడ్డికి వివాదరహితునిగా గుర్తింపు. నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. ఇలాంటి నేతను తప్పించటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఆర్యవైశ్యులు మహిధర్‌రెడ్డికి తొలినుంచి అండగా ఉన్నారు. ఇప్పుడు వారి ఓట్లే కీలకంగా మారాయి. టికెట్ లేదని తెలిసిన నాటి నుంచి మహిధర్ రెడ్డి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. చివరికి ప్రకాశం జిల్లాలో జరిగిన జగన్ పర్యటనలో కూడా మహిధర్ రెడ్డి కనిపించలేదు. దీంతో బుర్రా మధుసూధన్‌ యాదవ్‌కు మహిధర్ రెడ్డి వర్గం సహకరించేది లేదని తేలిపోయింది.


అటు టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వర్రావుకు మాజీ ఎమ్మెల్యే దివి శివరాంతో పాటు పోతుల రామారావు అండ కూడా ఉంది. దాదాపు రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ పోతున్నారు కూడా. అయితే ఇదే సమయంలో సోదరుడు ఇంటూరి రాజేష్ నుంచి నాగేశ్వర్రావుకు గట్టి పోటీ ఎదురవుతోంది. టీడీపీ టికెట్ ఆశించిన రాజేష్‌... అది దక్కకపోవడంతో... చివరికి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. రాజేష్‌తో చర్చించి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు నాగేశ్వర్రావు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. నాగేశ్వర్రావుకు రాజేష్‌ సహకరిస్తే మాత్రం కందుకూరులో టీడీపీ గెలుపు నల్లేరు మీద నడక అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: