ఏపీలో సాధారణ ఎన్నికలకు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే రాష్ట్రం అంతట ఎన్నికల వేడి మామూలుగా లేదు. అయా నియోజకవర్గాలలోను ప్రధాన పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారం వేగవంతం చేస్తూ.. ఎన్నికలను వేడెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక పార్టీలో సీటు రానివారు.. ప్రాధాన్యత లేని వారు ఇతర పార్టీలలోకి మారిపోతున్నారు. అధికార వైసీపీలో సీట్లు రాని చాలామంది ఇప్పటికే తెలుగుదేశం వైసీపీ, జనసేనలో చేరిపోయారు. అలాగే కొందరు టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్లి సీట్లు దక్కించుకుంటున్నారు. టీడీపీలో సీట్లు రాని కొందరు నేతలు వైసీపీలోకి కూడా వెళుతున్నారు.


ఈ జాబితాలోనే అధికార వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న ఓ కీలక నేత కూడా ఇప్పుడు వైసీపీని వీడి.. టీడీపీలోకి వెళ్లే ప్రయత్నాలలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ నేత ఎవరో కాదు రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన మాజీమంత్రి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి రెండుసార్లు తాడికొండ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు డొక్కా. 2014లో తెలుగుదేశం అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.


2019 ఎన్నికలలో ప్రతిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన.. ఎన్నికలలో ఓటమి తర్వాత వైసీపీలో చేరి అక్కడ కూడా ఎమ్మెల్సీ అయ్యారు. ఈసారి ఎన్నికలలో ఆయన తాడికొండ అసెంబ్లీ సీటు ఆశించారు.
అయితే జగన్ మాణిక్య వరప్రసాద్‌ను కాదని మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితకు తాడికొండ సీటు ఇచ్చారు. జగన్ తీరుపై కొద్ది రోజులుగా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు డొక్కా పార్టీని వీడాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా తన వర్గం నేతలు కార్యకర్తలతో ఆయన వరుసగా సమావేశాలు పెడుతూ వస్తున్నారు.


ఈ క్రమంలోనే ఆయన పార్టీ వీడాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తన అనుచరులకు సంకేతాలు ఇస్తున్నారు. టీడీపీలో చేరేందుకు డొక్కా మాణిక్య వరప్రసాద్ సిద్దమైనట్టు తెలుస్తోంది. మరోవైపు డొక్కా పార్టీ విడితే తాడికొండలో పెద్ద ఎఫెక్ట్ తగులుతుందని కచ్చితంగా కష్టాల్లో ఉన్న తాడికొండ సీటుకు.. మరింత ఇబ్బందులు తప్పవని వైసీపీ వాళ్ళు భావిస్తున్నారు. అందుకే డొక్కాను బొజ్జగించే ప్రయత్నాల్లో వైసీపీ నేతలు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: