- నాన్ క‌మ్మ ఓట్ల‌ను ఏకం చేసే ప్లాన్ బూమ‌రాంగ్‌
- ప‌రుచూరులో చేతులెత్తేసిన ఎడం బాలాజీ ..?
- అద్దంకిలో నాకు సీటే వ‌ద్దంటోన్న హ‌నిమి రెడ్డి ..?
- చిల‌క‌లూరిపేటలో కావ‌టి క‌ష్టాలు ప‌గోడికి కూడా వ‌ద్దు..


( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌గ‌న్ ముందుగానే టీడీపీకి వాకోవ‌ర్ ఇచ్చేశారు. కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు, రాజ‌కీయంగా చైత‌న్యం ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు... పైగా టీడీపీ కీల‌క నేత‌లు పోటీ చేస్తోన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను పెట్ట‌లేక ఎన్నిక‌ల‌కు నెల రోజుల ముందే అక్క‌డ జ‌గ‌న్ వాకోవ‌ర్ ఇచ్చేసిన ప‌రిస్థితే ఉంది. ఆ మూడు నియోజ‌క‌వ‌ర్గాలు ప‌క్క ప‌క్క‌నే ఉండ‌డం మ‌రో విశేషం. బాప‌ట్ల జిల్లాలోని అద్దంకి, ప‌రుచూరుతో పాటు ప‌ల్నాడు జిల్లాలో ఉన్న చిల‌క‌లూరిపేట‌లో వైసీపీ మూడు సీట్ల‌ను బంగారు ప‌ల్లెంలో పెట్టి టీడీపీకి ఇచ్చేసిన‌ట్టే..!


ఈ మూడు సీట్ల‌ను గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా ప్ర‌ధాన పార్టీలు క‌మ్మ వ‌ర్గానికే కేటాయిస్తూ వ‌స్తున్నాయి. ఈ సారి క‌మ్మేత‌ర ఓట్ల‌ను ఏకం చేసి గెల‌వాల‌న్న టార్గెట్‌తో జ‌గ‌న్ నాన్ క‌మ్మ‌ల‌కు సీట్లు కేటాయించారు. ఈ ఫార్ములా మూడు చోట్ల బోల్తా ప‌డ‌డంతో పాటు టీడీపీ క్యాండెట్ల‌కు పెద్ద‌గా క‌ష్టం లేకుండా గెలిచేలా ఉంది. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌గ‌న్ ఈక్వేష‌న్లు ఎలా బోల్తా ప‌డ్డాయో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా చూద్దాం.


ప‌రుచూరు:
ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నుంచి పోటీ చేస్తోన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఆయ‌న వ‌రుస‌గా రెండుసార్లు గెలిచి హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో అంత‌టి జ‌గ‌న్ వేవ్‌లోనే ఏకంగా కాక‌లు తీరిన రాజ‌కీయ యోధుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావును ఓడించి జెయింట్ కిల్ల‌ర్ అనిపించుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో క‌మ్మ‌ల‌దే రాజ‌కీయ ఆధిప‌త్యం. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ క‌మ్మ‌ల‌కే సీటు ఇచ్చినా వైసీపీ గెల‌వ‌లేదు. ఈ సారి క‌మ్మేత‌ర ఓట్ల‌ను ఏకం చేయాల‌ని ముందుగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు సీటు ఇచ్చారు. ఆమంచికి ప‌రుచూరులో సీన్ అర్థ‌మ‌వ్వ‌డంతో త‌న‌కు చీరాలే కావాల‌ని ప‌రుచూరు వ‌దిలేశారు. ఆ త‌ర్వాత ఎప్పుడో 2014లో చీరాల‌లో వైసీపీ నుంచి పోటీ చేసి మూడోస్థానంతో స‌రిపెట్టుకున్న యెడం బాలాజీ అనే ఎన్నారైను తీసుకువ‌చ్చి ఇప్పుడు సీటు ఇచ్చారు. బాలాజీ బ‌లిజ ( కాపు) వ‌ర్గానికి చెందిన వారు. ఇదే ఇక్క‌డ రాంగ్ ఈక్వేష‌న్ అనుకుంటే.. ఆయ‌న‌కు అస‌లు ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గ బౌండ‌రీలు, బోర్డ‌ర్లు, ఇక్క‌డ మండ‌లాలు, ఊరి పేర్లు... క‌నీసం పార్టీలో ప్ర‌ముఖ నేత‌లు ఎవ్వ‌రో కూడా తెలియ‌దు. అస‌లు ప‌రుచూరులో కొద్ది రోజులుగా టీడీపీలోకి భారీ ఎత్తున వ‌ల‌స‌లు జ‌రుగుతుండ‌డంతో బాలాజీ ఏం చేయాలో తెలియ‌క అస‌లు ఎన్నిక‌ల్లో పోటీ చేయాలా ? వ‌ద్దా అన్న డైలమాలో ప‌డ‌డంతో ఇక్క‌డ ఎన్నిక‌ల‌కు ముందే జ‌గ‌న్ టీడీపీ ఏలూరికి వాకోవ‌ర్ ఇచ్చేశార‌న్న సెటైర్లే వినిపిస్తున్నాయి.


అద్దంకి :
అద్దంకిలోనూ ప‌రుచూరు ప‌రిస్థితే ఉంది. ఇప్ప‌టికే నాలుగుసార్లు ఓట‌మి లేకుండా గెలుస్తూ వ‌స్తోన్న గొట్టిపాటి బుజ్జిని ఓడించాల‌న్న క‌సి జ‌గ‌న్‌లో ఉంది. జ‌గ‌న్ ఎంత క‌సితో బుజ్జిని ఓడించాల‌ని ఎత్తులు వేస్తుంటే బుజ్జి అక్క‌డ అంత‌కంటే స్ట్రాంగ్ అవుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో బుజ్జిపై ఓడిన బాచిన కుటుంబానికి నాలుగేళ్లుగా అద్దంకి బాధ్య‌త‌లు ఇచ్చిన జ‌గ‌న్ చివ‌ర్లో త‌ప్పించేశారు. దీంతో వాళ్లు సైకిల్ ఎక్కేశారు. ఇక్క‌డ కూడా క‌మ్మ‌ల‌కు సీటు ఇవ్వ‌కూడ‌ద‌ని త‌న సొంత సామాజిక వ‌ర్గ‌మైన రెడ్డి నేత‌కు టిక్కెట్ ఇచ్చారు. అస‌లు ఆయ‌న ఎవ‌రో కూడా ఇక్క‌డ ఎవ్వ‌రికి తెలియ‌దు. ఎక్క‌డో ప‌ల్నాడు జిల్లాలోని పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలోని దొడ్లేరుకు చెందిన పాణెం హ‌నిమిరెడ్డి అనే నేత‌కు ఇక్క‌డ సీటు ఇచ్చారు. జ‌గ‌న్ బాబాయ్ వైవి. సుబ్బారెడ్డికి ఇవ్వాల్సిన అమౌంట్ ఏదో సెటిల్ చేసుకునే క్ర‌మంలోనే హ‌నిమిరెడ్డికి సీటు ఇచ్చి చేతులు దులుపుకున్నార‌న్న గుసుగుస అయితే ఉంది. అస‌లు హ‌నిమిరెడ్డి స‌డెన్‌గా రెండు, మూడు రోజులు ఎవ్వ‌రికి క‌న‌ప‌డ‌కుండా మాయం అవుతోన్న తీరు చూస్తుంటే ఆయ‌న పోటీ చేస్తారా ?  చేయ‌రా ? అన్న సందేహాలు వైసీపీ వాళ్ల‌కే ఉన్నాయి. ఇటీవ‌ల జ‌గ‌న్ నియోజ‌క‌వ‌ర్గంలోని సంత‌మాగ‌లూరు అడ్డ‌రోడ్డుకు వ‌చ్చిన‌ప్పుడు కూడా ఆయ‌న రాలేదంటే ఇక్క‌డ ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. ఏదేమైనా అద్దంకి సీటును కూడా జ‌గ‌న్ బుజ్జికి వాకోవ‌ర్ ఇచ్చేసిన ప‌రిస్థితే ఉంది.


చిల‌క‌లూరిపేట‌:
చిల‌క‌లూరిపేట సీటు కూడా జ‌గ‌న్ మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావుకు ముందే వాకోవ‌ర్ ఇచ్చేస్తున్నారు. ఇక్క‌డ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని ఆమెను గుంటూరు వెస్ట్‌కు బ‌దిలీ చేసి.. మ‌ల్లేల రాజేష్ నాయుడ‌కు సీటు ఇచ్చారు. ఆయ‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకుని ఆగ‌మాగం చేశారు. ఇప్పుడు ఆయ‌న్న త‌ప్పించి గుంటూరు మేయ‌ర్ కావ‌టి మ‌నోహ‌ర్‌నాయుడుకు ఇచ్చారు. దీంతో రాజేష్ కూడా సైకిల్ ఎక్కేశారు. ప‌రుచూరు, అద్దంకిలాగానే ఇక్క‌డ కూడా సేమ్‌.. మ‌నోహ‌ర్‌కు అస‌లు పేట బౌండ‌రీలు తెలియ‌వు.. పైగా కమ్మ సామాజిక వ‌ర్గానికి ప‌ట్టున్న చోట కాపుల‌కు సీటు ఇవ్వ‌డం పెద్ద రాంగ్ స్టెప్ అని వైసీపీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. ఇక్క‌డ ర‌జ‌నీ, రాజేష్ నాయుడు, ఎమ్మెల్సీ మ‌ర్రి వ‌ర్గాల నుంచి కూడా కావ‌టికి పెద్ద‌గా కోప‌రేష‌న్ క‌న‌ప‌డ‌డం లేదు. పుల్లారావు అయితే పూర్తి రిలాక్స్ గా ఎన్నిక‌ల ప్ర‌చారం చేసుకుంటోన్న ప‌రిస్థితి. ఏదేమైనా ప‌క్క‌ప‌క్క‌నే ఉన్న మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఎన్నిక‌ల‌కు ముందే దారుణంగా చేతులెత్తేసి క‌ళ్ల‌ప్ప‌గించి చూడ‌డం మిన‌హా చేస్తోందేమి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: