ఏపీలో ఎన్నికల వేళ రాళ్లదాడి కలకలం రేపుతోంది. శనివారం రాత్రి విజయవాడలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి మరువక ముందే.. ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అలాంటి స్థాయిలోనే దాడి జరిగింది. ఈ రెండు ఘటనలు గురించి చర్చిస్తుండగా విశాఖ జిల్లాలో ప్రతిపక్ష నేతపై మరో సారి రాళ్ల దాడి జరిగింది.


గుంటూరు జిల్లా తెనాలిలో వారాహి వాహనంలో పవన్ కల్యాణ్ యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి పవన్ పై రాయి విసిరారు. దీంతో పవన్ అప్రమత్తం అయ్యారు. ఆ రాయిని దృష్టిలో పెట్టుకొని దూరం జరిగారు. జనసైనికులు వెంటనే నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు విసిరారు అనే అంశాలపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు.


ఇదిలా ఉండగా.. ఏపీ లో రాజకీయాలు క్లైమాక్స్ కి చేరుకున్నాయి. ఎన్నికలకు పట్టుమని నెల రోజుల సమయం కూడా లేదు. దీంతో రాజకీయాలు రాళ్ల చుట్టూ మారాయి. దాడులు జరగడం.. వాటిని రాజకీయ నాయకులు వాళ్ల అవసరాల కోసం.. సానుభూతి పొందేందుకు వినియోగించడం వంటివి చూస్తుంటే సాధారణ పౌరులకు రాజకీయాలు అంటే విరక్తి కలిగేలా చేస్తుంది.


గతంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సమయంలోను ఇలానే రాళ్లదాడి జరిగింది. ఇప్పుడు రాజకీయ పార్టీల అధినేతల మీద జరుగుతున్నాయి. వీటిని ఖండించాల్సిన ఆయా పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కొడాలి నాని మాట్లాడిన వీడియోలను టీడీపీ వైరల్ చేస్తుంటే.. చంద్రబాబు రెచ్చగొట్టిన వీడియోలను వైసీపీ చేస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై జరిగిన దాడిపై వైసీపీ నాయకులు అవహేళన చేసి మాట్లాడుతున్నారు. మొత్తం మీద ఈ దాడుల సంస్కృతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: