ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం గంగాధ‌ర నెల్లూరు. ఇక్క‌డ నుంచి వైసీపీ నాయ‌కుడు, మంత్రి నారాయ‌ణ స్వామి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే..ఈ ద‌ఫా ఆయ‌న కుమార్తెకు టికెట్ ఇప్పించుకున్నారు. దీంతో కృపాల‌క్ష్మి.. ఇక్క‌డ బ‌రిలో ఉన్నారు. తండ్రిఇమేజ్‌.. జ‌గ‌న్ ప‌థ‌కాల‌తో ఆమె ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. సాధార‌ణంగా ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి పోటీ తీవ్రంగా ఉంటుంది. దీనిని ఈదుకుని రావాల్సి ఉంటుంది. దీనికి కూడా కృపా ల‌క్ష్మి రెడీ అయ్యారు.


కానీ, అనుకున్న విధంగా మాత్రం ప‌రిస్థితి లేదు. ఎందుకంటే.. ఇప్పుడు ఆమెకు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి సొంత బావే కావ‌డంతో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. దీనిని గ్ర‌హించిన నారాయ‌ణ స్వామి.. పార్టీ కేడర్ తన కుమార్తె కృపా లక్ష్మికి సహకరించాలని, ఇకపై నాన్న, అన్న, తమ్ముడు, అంతా వీళ్ళేన‌ని చెప్పుకొస్తున్నా రు. కుమార్తెను గెలుపించే బాధ్యతను కూడా పార్టీ కేడ‌ర్‌కే అప్ప‌గించారు. అంతేకాదు... ఎప్పుడూ  బయట కు రాని త‌న‌ కూతురు ప్రజల కోసం వచ్చిందంటూ ఇంటింటికీ వెళ్లి చెబుతున్నారు.


అయితే.. నారాయణ స్వామి చెల్లెలి కుమారుడు రమేష్ బాబు ఇప్పుడు గ‌ట్టిపోటీ ఇస్తున్నారు. ఈయ‌న ఇటీవ‌లే కాంగ్రెస్‌లో చేర‌డం.. ఆయ‌న‌కు పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల గంగాధ‌ర నెల్లూరు టికెట్ ఇవ్వ‌డం వంటివి చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. దీంతో ఆయ‌న స్వ‌యంగా రంగంలోకి దిగారు. నిజానికి గత ఎన్నికల్లో నారాయణ స్వామి గెలుపు కోసం పని చేసిన ర‌మేష్‌ తొలిసారి పోటీకి దిగారు. పైగా నారాయణ స్వామి వెంట నడిచిన వ్యక్తిగా ఆయ‌న గుట్టు మట్లు, వీక్‌నెస్‌లు అన్నీ తెలిసి ఉండ‌డంతో ఆ దిశ‌గానే అడుగులు వేస్తున్నారు.


నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు అంద‌రినీ ర‌మేష్ ప్ర‌భావితం చేస్తున్నారు. పైన చెప్పుకొన్న‌ట్టుగా నారాయ‌ణ‌స్వామి త‌ర్వాత‌.. అంతే స్థాయిలో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ర‌మేష్ న‌డిపించారు. నాయకులు నిన్నటి వరకు ఏ పని కావాలన్నా అడిగి చేసుకున్న రమేష్ బాబు ఇప్పుడు వారిని త‌న చెంత‌కు తీసుకుంటున్నారు. దీంతో  నారాయణ స్వామి కుమార్తె ఇబ్బందుల్లో ప‌డిపోయారు. అస‌లు ఆమె గెలుపు మాట ఎలా ఉన్నా.. ప్ర‌చారానికి కూడా ప‌ట్టుమ‌ని వంద‌మంది రాని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో స్వామి ఇంటింటికీ తిరుగుతున్నారు. మ‌రి ఏమేర‌కు విజ‌యం ద‌క్కించుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: