విశాఖపట్నంలో వాల్తేరు క్లబ్ వ్యవహారం వైసీపీలో చిచ్చు రాజేసింది. వైసీపీలో కీలక నేతలు విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ మధ్య ఇది విభేదాలు దారి తీసింది. వాల్తేరు క్లబ్ ప్రైవేటు వ్యవహారంగా ఇప్పటి వరకు అంతా భావించారు. ఇది ప్రైవేట్ భూమి అని, దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదని కొందరు వాదిస్తున్నారు. అయితే వైసీపీలో కీలక నాయకుడు, నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి మాత్రం ఇది ప్రభుత్వ భూమి అని, దీనిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగిస్తామని తాజాగా వ్యాఖ్యానించారు. దీనిపై విశాఖ రాజకీయాల్లో సంచలనం రేగింది. ప్రస్తుతం విశాఖపట్నంలో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ పోటీ చేస్తున్నారు. ఆమె గెలుపు అవకాశాలపై వాల్తేరు క్లబ్ అంశం ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో వెంటనే బొత్స సత్యనారాయణ స్పందించారు. వాల్తేరు క్లబ్ ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందినది కాదని, ఇది అన్ని సామాజిక వర్గాలకు చెందినదని అన్నారు. వాల్తేరు క్లబ్‌పై రాజకీయాలు తగదని, విశాఖ పెద్దల గౌరవాన్ని తాను కాపాడుతానని అన్నారు. వైసీపీలో ఇద్దరు పెద్ద నాయకుల మధ్య విభేదాలకు దారి తీసిన ఈ అంశంపై వివరాలు తెలుసుకుందాం.

విశాఖ నగరం నడిబొడ్డున కీలకమైన ప్రాంతంలో వాల్తేరు క్లబ్ ఉంది. ఈ ప్రైవేట్ క్లబ్‌లో విశాఖకు చెందిన 2000ల మంది వరకు సభ్యులు ఉన్నారు. దీని సభ్యత్వానికి రూ.50 లక్షలు ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. దాదాపు 32 ఎకరాల భూమిలో ఇది విస్తరించి ఉంది. దీని భూమిపై అందరి కన్ను పడింది. గతంలో ప్రతిపక్షంగా ఉన్న సమయంలో వైసీపీ నేత విజయసాయి రెడ్డి దీనిలో సభ్యత్వానికి ప్రయత్నించారు. అయితే ఆయనకు సభ్యత్వం ఇవ్వలేదు. దీంతో ఆ అక్కసుతోనే వాల్తేరు క్లబ్ భూములను స్వాధీనం చేసుకోవడానికి విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే విజయసాయిరెడ్డి వాదన ప్రకారం ఇది ప్రభుత్వ భూమి అని, దీనిని కొందరు లీజుకు తీసుకున్నారని చెబుతున్నారు. అయితే ఆ లీజు ముగిసిందని అన్నారు. అందువల్లే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. దీనిపై గతంలో సిట్‌కు ఫిర్యాదు చేయడం, వాల్తేరు క్లబ్ హైకోర్టుకు వెళ్లి సిట్ ఉత్తర్వులపై స్టే తెచ్చుకోవడం జరిగాయి. విశాఖపట్నంలో అత్యంత ధనవంతులు సభ్యులుగా ఉండే ఈ క్లబ్ విషయంలో విజయసాయి రెడ్డి జోక్యం వల్ల వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తాయని అంతా భావిస్తున్నారు. దీంతో బొత్స సత్యనారాయణ దిద్దుబాటు చర్యలకు దిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: