- కుప్పంలో కొండ లాంటి బాబుపై భ‌ర‌త్ పోటీ
- లోకేష్‌, బాల‌య్య‌లా బాబుపైనా బీసీ అస్త్రం
- స్థానిక ఫ‌లితాలు రిపీట్ అయితే బాబోరు అవుటే..?


( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )
ఎన్నిక‌ల స‌మ‌రం అంటే మాట‌లు కాదు. ఒక‌ప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల కు మ‌ధ్య చాలా వ్య‌త్యాసం ఉంది. ఒక‌ప్పుడు.. నాయ‌కుల‌ను చూసి ఓటు వేసే ప‌రిస్థితి ఉంది. కానీ, ఇప్పుడు డ‌బ్బు, అభ్య‌ర్థుల బ‌లాబ‌లాల‌ను చూసి ఓటెత్తుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అందుకే పార్టీలు కూడా.. అభ్య‌ర్థుల ఎంపిక నుంచే స‌వాల‌క్ష అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఈక్వేష‌న్లు కుదిరితేనే టికెట్లు ఇస్తున్నాయి.


అయితే.. వైసీపీ మాత్రం తాజా ఎన్నిక‌ల్లోబ‌ల‌మైన ప్ర‌యోగం చేస్తోంది. సామాన్యుల‌ను, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గా నికి చెందిన వారిని పోటీలో పెడుతోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై పోటీ చేసే అభ్య‌ర్థి విష‌యంలో మ‌రింత ప్ర‌యోగానికి దిగింద‌నే చెప్పాలి. ఇక్క‌డ నుంచి ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న భ‌ర‌త్ ను వైసీపీ అసెంబ్లీ బ‌రిలో నిలిపింది. అయితే.. భ‌ర‌త్ ఒక‌ర‌కంగా రాజ‌కీయాలకు కొత్తే అని చెప్పాలి. అయితే.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఒకింత దూకుడు ప్ర‌ద‌ర్శించారు.


అయిన‌ప్ప‌టికీ అసెంబ్లీ వంటి కీల‌క‌మైన ఎన్నిక‌ల‌కు భ‌ర‌త్ కొత్త‌. పైగా.. ప్ర‌త్య‌ర్థిగా ఉన్న వ్య‌క్తి అసామాన్యు డు. ఒక పార్టీకి అధినేత‌.. ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్న నాయ‌కుడు. పైగా మూడు సార్లు ముఖ్య‌మంత్రి. కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన నాయ‌కుడు. ఆయ‌నే చంద్ర‌బాబు. గ‌డిచిన 7 ఎన్నిక‌ల నుంచి అంటే.. 35 ఏళ్లుగా చం ద్ర‌బాబు ఇక్క‌డ గెలుపుగుర్రం ఎక్కుతూనే ఉన్నారు. ఇలాంటి అత్యంత బ‌ల‌మైన నాయ‌కుడిపై వైసీపీ భ‌యంక‌ర‌మైన ప్ర‌యోగం చేసింది.


ఈ క్ర‌మంలోనే సామాన్య యువ నాయ‌కుడిగా ఉన్న భ‌ర‌త్‌ను ఇక్క‌డ బ‌రిలో నిలిపింది. ఈ నేప‌థ్యంలో కుప్పం ప్ర‌జ‌లు ఎలాంటి తీర్పు ఇస్తార‌నేదిఆస‌క్తిగా మారింది. అయితే.. గ‌త నాలుగేళ్లుగా కూడా భ‌ర‌త్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు చాలా ద‌గ్గ‌ర‌గా ఉన్నారు. వారి స‌మ‌స్య‌లు తీర్చుతున్నారు. అదేవిధంగా ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను కూడా అందిస్తున్నారు. ఇవ‌న్నీ..త‌న‌కు ప్ల‌స్ అని భ‌ర‌త్ చెబుతున్నారు. ఇక‌, భ‌ర‌త్ దూకుడు పెర‌గ‌డంతో చంద్ర‌బాబు కూడా అలెర్ట‌య్యారు. ఇక్క‌డే ఇల్లు క‌ట్టుకుంటున్నారు. లోక‌ల్‌గానే ఉంటాన‌ని కూడా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో అసామాన్యుడిపై  సామాన్యుడి పోరు ఎలా ఉండ‌నుంద‌నేది ఆస‌క్తిగామారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: