రాష్ట్రంలో జ‌రుగుతున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కేవ‌లం మ‌హిళ‌లే ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థులుగా పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు మూడు ఉన్నాయి. గుంటూరు వెస్ట్‌, రంప‌చోడ‌వ‌రం, పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ అభ్య‌ర్థులుగా మ‌హిళ‌లే బ‌రిలో నిలిచారు. వీరిలో ఎవ‌రు విన్న‌వుతా రు..?  ఎవ‌రు ప్ర‌జాభిమానం సొంతం చేసుకుంటార‌నేది చూడాలి. అయితే.. మ‌హిళ‌లే అయినా.. ఠారెత్తు తున్న ఎండ‌ల‌కు కూడా ఓర్చుకుని పురుష అభ్య‌ర్థుల కంటే కూడా ఎక్కువ‌గా ప్ర‌చారం చేస్తున్నారు.


ఇక‌, అసెంబ్లీ  స్థానాల మాదిరిగానే పార్ల‌మెంటు స్థానానికి కూడా.. ప్ర‌ధాన పార్టీల నుంచి ఇద్ద‌రూ మ‌హిళ‌లే త‌ల‌ప‌డుతున్న ఏకైక నియోజ‌క‌వ‌ర్గం అర‌కు. రాష్ట్రంలో ఉన్న అతి పెద్ద నియోజ‌క‌వ‌ర్గం కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. 7 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు.. 30కిపైగా మండలాలు ఉన్న పార్ల‌మెంటె సెగ్మెంట్ ఇదే. పైగా కొండ ప్రాంతాలు, తండాలు, న‌గ‌రానికి దూరంగా ఉన్న ప్రాంతాలు ఈ నియోజ‌క‌వ‌ర్గం సొంతం. దీంతో  మ‌హిళా అభ్య‌ర్థులు ప్ర‌చారంలో చ‌మ‌టోడుస్తున్నారు.


ప్ర‌ధాన పార్టీలైన వైసీపీ నుంచి రాజ‌కీయ వార‌సురాలు.. గుమ్మ త‌నూజ రాణి బ‌రిలో ఉన్నారు. ఇక‌, టీడ‌పీ-జ‌న‌సేన‌-బీజేపీ కూట‌మి అభ్య‌ర్థిగా బీజేపీ పార్టీ త‌ర‌ఫున మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత పోటీ చేస్తున్నారు. వీరిలో గీత చాలా సీనియ‌ర్ నాయ‌కురాలే అయినా.. ప్ర‌స్తుత ఎన్నికల్లో మాత్రం చాలా క‌ష్ట‌ప‌డుతున్నారు. ఉద‌యాన్ని క్యారేజీ తీసుకుని ప్ర‌చారానికి వెళ్లిపోతున్నారు. కొండ ప్రాంతాల్లో సుదూరాలు న‌డిచి మ‌రీ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.


ఇక‌, తొలిసారి రాజ‌కీయ అరంగేట్రం చేసిన త‌నూజ రాణి.. వృత్తి ప‌రంగా వైద్యు రాలు కావ‌డంతో స్తానికంగా మంచిపేరు సంపాయించుకున్నారు. ఆమె ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పైనే ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్నారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కు తిరుగుతున్నారు. తనూజ రాణి.. అర‌కు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ కోడ‌లు కావ‌డం గ‌మ‌నార్హం. ఇది కూడా ఆమెకు క‌లిసి వ‌చ్చే అంశంగా చెబుతున్నారు. మొత్తానికి ఒక ఎస్టీ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో త‌ల‌ప‌డుతున్న ఇద్ద‌రు మ‌హిళ‌ల్లో ఎవ‌రిని ప్ర‌జ‌లు ఆద‌రిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: