నంద్యాల ఎంపీగా పోటీ చేస్తున్న తనను విజయవంతంగా గెలిపిస్తే ప్రజలకు ఎల్లపుడూ అందుబాటులో ఉంటూ జిల్లా అభివృద్ధికి ఎనలేని సేవలు చేస్తానని తెదేపా ఎంపీ అభ్యర్థి అయినటువంటి డా. బైరెడ్డి శబరి తాజాగా జరిగిన ర్యాలీలో చెప్పుకొచ్చారు. నంద్యాల పార్లమెంటు నియోజక వర్గానికి తెదేపా తరఫున సోమవారం ఆమె నామినేషన్‌ వేసిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో ఆమె పట్టణంలోని తన ఎన్నికల కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూనెపల్లె ఉపరితల వంతెన కింద తెదేపా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.

ఆమె మాట్లాడుతూ... రైతులకు సాగునీరు అందివ్వలేమని అధికారులతో నోటీసులు ఇప్పించిన ఘనత  ఈ ఒక్క నంద్యాల ఎంపీ, ఎమ్మెల్యేలకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. కాటసాని, శిల్పా కుటుంబాలతో పాటు గంగుల, బుగ్గన కూడా ఈ ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోతున్నారని ఈ సందర్భంగా జోశ్యం చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో నంద్యాల అభివృద్ధి కుంటుపడిందని, దానిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాట్లాడారు. తనని గెలిపిస్తే నంద్యాలని ఉన్నతమైన స్థానంలో ఉంచుతానని ఆమె ప్రజలకు ఈ వేదికగా మాటివ్వడం జరిగింది. కాగా ఈ ర్యాలీలో నంద్యాల తెదేపా ఎమ్మెల్యే ఎన్‌ఎండీ ఫరూక్‌, జనసేన నాయకులు అయినటువంటి ఇరిగెల రాంపుల్లారెడ్డి, తెదేపా రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి, శబరి భర్త శివచరణ్‌రెడ్డి, భాజపా నాయకులు మేడా మురళీధర్‌, చెరుకుచెర్ల రఘురామయ్య, పాల్గొన్నారు.

ఇకపోతే శబరి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తెనే ఈ బైరెడ్డి శబరి. ప్రస్తుతం ఈమె నంద్యాల జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతుండడం గమనార్హం. తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా బీజేపీ పార్టీలో ఉన్నారు. అయితే సీమలో బైరెడ్డి కుటుంబానికి మంచి పేరుంది కాబట్టి ఉమ్మడి కర్నూలు జిల్లాలో బైరెడ్డి కుటుంబానికి రాజకీయంగా మంచి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే శబరిని నంద్యాల లోక్ సభకు టీడీపీ నుంచి బరిలోకి దింపడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: