ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం నూజివీడు. ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాలు వైసీపీకే ద‌క్కుతున్నాయి. గ‌తంలో 1983 నుంచి జ‌రిగిన ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. నూజివీడు నుంచి టీడీపీ ఐదు సార్లు విజ‌యం ద‌క్కించుకుంది. 1983, 1985, 1994, 1999, 2009ల‌లో సైకిల్ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రుగులు పెట్టింది. మిగిలిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డ కాంగ్రెస్‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలే విజ‌యం నమోదు చేశాయి. మ‌రీ ముఖ్యంగా 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది.


దీంతో ఇక్క‌డ వైసీపీ హ‌వాకు బ్రేక్ వేయాల‌నేది టీడీపీ వ్యూహం. ఈ క్ర‌మంలోనే పెన‌మ‌లూరు  ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నాయ‌కుడు.. కొలుసు పార్థ‌సార‌థిని ఇక్క‌డ బ‌రిలో నిలిపి బీసీ వాద‌న‌ను వినిపిస్తున్నారు. ఇది ఒక‌ర‌కంగా మంచిదే. ఎందుకంటే.. బీసీల‌కు ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని చెబుతున్న పార్టీ కావ‌డంతో ఆ వ‌ర్గాన్ని ఆక‌ర్షించేందుకు అవ‌కాశం ఉంది. అయితే.. మ‌రోవైపు.. వైసీపీ నుంచి మేకా వెంక‌ట ప్ర‌తాప్ బ‌రిలో ఉన్నారు. ఈయ‌న‌కు కూడా.. ప్ర‌జాద‌ర‌ణ చెక్కు చెద‌ర‌లేదు.


పైగా.. మేకా కుమారుడు నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తివార్డునూ చుట్టేస్తున్నారు. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందు కు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనికి తోడు.. ఆర్థికంగా కూడా.. ముందుగానే నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు త‌మ వారికి.. సాయాలు అందించేశారు. ఇది కొంత ప్ల‌స్ గా మారింది. ఇక‌, సంప్ర‌దాయంగా వ‌స్తున్న వైసీపీ ఓటు బ్యాంకు కూడా.. మేకా విజ‌యానికి దోహ‌ద‌ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది. నూజివీడు రైతుల‌కు మేకా చేసిన స‌హ‌కారాన్ని వారు ఇప్ప‌టికీ చెప్పుకొంటున్నారు.


ఈ నేప‌థ్యంలో కొలుసు గెలుపు అంత ఈజీ అయితే.. కాదు. అలాగ‌ని తీసిపారేసేందుకు కూడా అవ‌కాశం లేదు. బ‌ల‌మైన పోటీ అయితే.. ఇస్తున్నారు. హోరాహోరీగా పోటీ ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో నూజివీడు కూడా ఉంది. కేవ‌లం 10 శాతం ఓటు బ్యాంకు విష‌యంలోనూ కొలుసు వ‌ర్సెస్ మేకా మ‌ధ్య పోటీ ఉంటుంద‌ని.. స‌ర్వేలు చెబుతున్నాయి. దీనిని క‌నుక కొలుసు త‌నవైపు తిప్పుకొంటే బెట‌ర్ అవుతుంది. అయితే.. ఇక్క‌డ రెబ‌ల్‌గా మారిన ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావు ఇండిపెండెంట్‌గా నామినేష‌న్ వేశారు. ఈయ‌న‌ను బ‌రి నుంచి త‌ప్పిస్తే.. టీడీపీకి గెలుపు అవ‌కాశాలు మెరుగు ప‌డ‌తాయి. లేక‌పోతే.. టీడీపీ సానుకూల ఓటు బ్యాంకును ఆయ‌న చీల్చే అవ‌కాశం ఎక్కువ‌గా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: