విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేపుతుంది. వాస్తవంగా ఈ నియోజకవర్గ నుంచి 2014 - 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రముఖ కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని శ్రీనివాస్ ( నాని ) పోటీ చేసి విజయం సాధించారు. 2014లో తొలిసారి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టిన నాని 2019 ఎన్నికలలో అంతటి వైసిపి ప్రభంజనాన్ని తట్టుకుని కూడా విజయవాడ ఎంపీగా వరుసగా రెండోసారి విజయం సాధించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరు వరప్రసాద్ ఇక్కడ వైసిపి నుంచి పోటీ చేయగా ఆయనపై నాని స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు.


తన పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్క విజయవాడ తూర్పులో మాత్రమే టిడిపి గెలిచింది. అయినా నానికి అనుకూలంగా భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో ఆయన ఎంపీగా వరుసగా రెండోసారి విజయం సాధించారు. నాని ఎంపీగా గెలిచిన రెండేళ్ల నుంచి తెలుగుదేశం పార్టీతో విభేదిస్తూ రావడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఈసారి ఆయనకు సీటు ఇవ్వలేదు. నాని తెలుగుదేశం పార్టీని వీడి వైసిపి కండువా కప్పుకుని ఆ పార్టీ నుంచి విజయవాడ పార్లమెంటుకు వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం అనుహ్యంగా నాని సోద‌రుడు కేశినేని శివనాథ్ ( చిన్ని ) కి ఎంపీ టికెట్ ఇచ్చింది.


అలా రెండు ప్రముఖ పార్టీల నుంచి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సొంత అన్నదమ్ములు పోటీపడుతూ ఉండడంతో విజయవాడ పార్లమెంటు సీటు రాష్ట్రవ్యాప్తంగానే ఆసక్తిగా మారింది. అయితే ఇప్పుడు ఇదే పార్లమెంటు సీటు నుంచి ఇదే కేశినేని కుటుంబానికి చెందిన మరో నేత కూడా పోటీకి రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వల్లూరు భార్గవ్ బెజవాడ పార్లమెంట్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కేశినేని వెంకయ్య కుమారుడు రామస్వామి ... ఆయన తనయులు శివనాథ్ - శ్రీనివాస్. వెంకయ్య కుమార్తె వల్లూరు కస్తూరి. ఆమె మనవడు భార్గవ్ అంటే.. వెంకయ్య ఇద్దరు మనవాళ్లు శివనాథ్ ( చిన్ని ) ,  శ్రీనివాస్ ( నాని ) కాగా భార్గవ్ ముని మనవడు అవుతాడు. ఇలా ఒకే పార్లమెంటు సీటు నుంచి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పోటీలో ఉండటం సహజంగానే ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: