వైసీపీ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి ప్రస్తుతం అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూడి ముత్యాల నాయుడు కి ఆయన కుమారుడు తలనొప్పిగా మారారు. తన తండ్రికి కుమారుడు సన్ స్ట్రోక్ ఇచ్చారు. అసలు విషయంలోకి వెళితే మాడుగుల నియోజకవర్గానికి చెందిన బూడి ముత్యాల నాయుడు, జడ్పిటిసిగా తన ప్రస్థానం ప్రారంభించారు. 2014 ఎన్నికలలో వైసీపీ నుంచి ఎమ్మెల్యే సీటు ద‌క్కించుకున్న ఆయన ఆ ఎన్నికలలో 500 ఓట్ల స్వల్ప తేడాతో టిడిపి నుంచి అప్పటి సీటింగ్ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు పై విజయం సాధించారు. 2019 ఎన్నికలలోను ముత్యాల నాయుడు వైసీపీ నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.


ఈ క్రమంలోనే మార్పులు చేర్పుల్లో భాగంగా జగన్ ముత్యాల నాయుడు కు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు డిప్యూటీ సీఎం పదవి కూడా కట్టబెట్టారు. ఇక తాజా ఎన్నికల విషయానికొస్తే ఆయన మరోసారి మాడుగుల నుంచి అసెంబ్లీకి పోటీ చేసి వరుసగా మూడోసారి విజయం సాధించాలని ఆశలు పెట్టుకున్నారు. జగన్ ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ముత్యాల నాయుడు ని అనకాపల్లి పార్లమెంటు నుంచి ఎంపీగా బరిలోకి దింపారు. మాడుగుల సీటును ముత్యాల నాయుడు కుమార్తె ఈర్లే అనురాధకు కేటాయించారు. అనురాధ ఎవరో కాదు ముత్యాల నాయుడు రెండో భార్య కుమార్తె కావడం విశేషం. అయితే ముత్యాల నాయుడు మొదటి భార్యకు కూతురు, కొడుకు ఉన్నారు.


ఇటు రెండో భార్యకు కూడా కుమారుడు, కూతురు ఉన్నారు. తన ఇద్దరు కుమారులను రాజకీయ వారసులుగా కాకుండా రెండో భార్య కుమార్తె అనురాధకు మాడుగుల సీటు ఇప్పించుకోవడంతో కుమారులు ఇద్దరు కొద్దిరోజులుగా రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే మొదటి భార్య కుమారుడు రవికుమార్ తండ్రిపై నిరసన గళం  వినిపిస్తున్నారు. మాడుగుల అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మాడుగుల అభివృద్ధి ప్రజా స‌మ‌స్య‌ల పరిష్కారానికి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అని .. తాను ఎప్పుడు ప్రజల కోసమే పని చేస్తానని ఈ విషయం మాడుగుల నియోజకవర్గ ప్రజలు అందరికీ తెలుసు అని తనను గెలిపించాలని ఆయన కోరుతున్నారు.


ఇక వైస్ వైసీపీ నాయకుల అడుగులకు మడుగులు వత్తే రెవెన్యూ అధికారులపై తాను న్యాయపోరాటం చేస్తానని కూడా రవికుమార్ చెబుతున్నారు.  ఇలా సొంత కుమార్తె పై తన సొంత కుమారుడే ఇండిపెండెంట్గా పోటీలో ఉండడంతో ముత్యాల నాయుడు కి స‌న్ స్ట్రోక్ తప్పదని స్థానికంగా చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: